కలం, కరీంనగర్ బ్యూరో : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యులే కాదు..ఇప్పుడు ఏకంగా మంత్రులే టార్గెట్‌గా సైబర్ దాడులకు తెగబడుతున్నారు. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. మంత్రి శ్రీధర్ బాబు, ఆయన సతీమణి సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యార్లను లక్ష్యంగా చేసుకుని కొందరు దుండగులు మార్ఫింగ్ వీడియోలతో సోషల్ మీడియాలో దుష్ప్రచారం సాగిస్తున్నారు. సాంకేతికతను మంచి కోసం కాకుండా, చెడు పనుల కోసం, దుష్ప్రచారం కోసం వాడుతూ సైబర్ నేరగాళ్లు ఆందోళన కలిగిస్తున్నారు.
లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు దంపతులపై నకిలీ మార్ఫింగ్ వీడియోలను సృష్టించారు. ముఖ్యంగా ప్రతిష్టాత్మక కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిధుల అక్రమాలకు సంబంధించిన అంశాన్ని జోడిస్తూ మంత్రి శ్రీధర్ బాబును తప్పుడు రీతిలో చిత్రీకరిస్తూ ఫేక్ వీడియోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ’బీఆర్ఎస్ మంథని’ అనే ఫేస్బుక్ పేజీ, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో అభ్యంతరకర కంటెంట్‌తో కూడిన వీడియోలను పోస్ట్ చేస్తూ, వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా కుట్రలు పన్నుతున్నారు.
ఈ వీడియోలను ఇతరులకు పోస్ట్ చేస్తూ తీవ్రంగా దుష్ప్రచారం చేస్తున్నట్లు వెల్లడైంది. వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా సాగుతున్న ఈ కుట్రపై మంత్రి శ్రీధర్ బాబు అడ్వకేట్ శశిభూషణ్ కాశే సైబర్ క్రైమ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ తప్పుడు ప్రచారానికి సంబంధించిన పక్కా ఆధారాలను కూడా పోలీసులకు సమర్పించారు. ఉన్నతమైన పదవుల్లో, స్థానాల్లో ఉన్నవారి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వెకిలి పనులు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి లాయర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి తీవ్రంగా దర్యాప్తు ప్రారంభించారు.

