కలం, వెబ్ డెస్క్: లోక్ సభ ప్రత్యేక హక్కుల కమిటీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేసింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు సంబంధించి ఈ నెల 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలని సూచించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కమిటీకి ఫిర్యాదు చేశారు. పరీక్ష పేపర్ లీక్ బిల్లు సందర్భంగా జరిగిన చర్చలో రూల్ 353 కింద ఎలాంటి నోటీస్ లేకుండానే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వివరణ ఇవ్వాలని కమిటీ నుంచి నోటీసులు వెళ్లాయి.
మరో ఫిర్యాదు..
రాహుల్ గాంధీపై నిబంధనల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ డాక్టర్ సంజయ్ జైశ్వాల్ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. లోక్ సభ రూల్స్‌కు విరుద్ధంగా బిల్లుపై జరిగిన చర్చలో అమిత్ షాపై అనవసర ఆరోపణలు చేశారని వెల్లడించారు. ఇందుకు సంబంధించి, ఒక్క ఆధారం కూడా రాహుల్ ప్రదర్శించలేదని.. ఇది సభా నియమాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. కాగా, తనకు నోటీసులు జారీ అయిన అంశంపై రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయం ఇంతవరకు స్పందించలేదు.

