Mobile Popup Ad
Mobile Popup Ad

సాఫ్ మహిళల ఫుట్‌బాల్‌లో భారత్ ఘన విజయం

కలం, స్పోర్ట్స్ : సాఫ్ మహిళల ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌ (SAFF Championship) ను భారత జట్టు అద్భుత విజయంతో ప్రారంభించింది. మాల్దీవులపై 11-0 తేడాతో ఘన విజయం సాధించి టైటిల్ పోరుకు తామే బలమైన జట్టని చాటింది. గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా భారత జట్టు ఆధిపత్యంలో సాగింది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన భారత్ ప్రత్యర్థికి ఏ దశలోనూ అవకాశం ఇవ్వలేదు. మ్యాచ్‌లో అవేకా సింగ్ స్టార్‌గా నిలిచింది.

22 ఏళ్ల ఈ మిడ్‌ఫీల్డర్ నాలుగు గోల్స్‌తో అదరగొట్టింది. మరో రెండు గోల్స్‌కు సహకారం అందించింది. ఆమె ప్రదర్శనతో మాల్దీవుల రక్షణ పూర్తిగా కూలిపోయింది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా ఆమెకే దక్కింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 69వ స్థానంలో ఉన్న భారత్, 167వ ర్యాంక్ మాల్దీవులపై మొదటి నుంచే ఒత్తిడి పెంచింది. ఐదో నిమిషంలోనే భారత్ గోల్ చేసింది. కానీ అది ఆఫ్‌సైడ్‌గా తేలడంతో లెక్కలోకి రాలేదు.

అయితే కొద్దిసేపటికే ప్రియాంకా నౌరెమ్ గోల్ చేసి భారత్‌కు ఆధిక్యం అందించింది. అక్కడి నుంచి భారత జట్టు వెనక్కి తిరిగి చూడలేదు. తొలి అర్ధభాగం ముగిసే సరికి భారత్ 5-0తో ముందంజలో నిలిచింది. రెండో అర్ధభాగంలో కూడా అదే జోరు కొనసాగింది. మరో ఆరు గోల్స్ సాధించి స్కోర్‌ను 11కి చేర్చింది. అవేకా సింగ్ రెండో భాగంలో మూడు గోల్స్ చేసింది. అవేకాతో పాటు ప్రియాంకా నౌరెమ్ రెండు గోల్స్ చేసింది. కరిష్మా రెండు సార్లు గోల్ చేసింది. ప్యారీ జాక్సా, డాంగ్మీ గ్రేస్, సంగీతా బాస్‌ఫోర్ కూడా చెరో గోల్ నమోదు చేశారు.

ఇది గోవాలో భారత మహిళల జట్టు ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం విశేషం. ఆ మ్యాచ్‌ను అభిమానులు గుర్తుంచుకునేలా జట్టు భారీ విజయంతో ముగించింది. భారత్‌కు మాల్దీవులపై ఇదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఎనిమిది మ్యాచ్‌లలో భారత్ ఏడు సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. గ్రూప్-బీలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. తదుపరి మ్యాచ్‌లో భారత్ ప్రస్తుత ఛాంపియన్ బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>