కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: దేవరకద్ర (Devarkadra) అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి (Madhusudan Reddy) తెలిపారు. మంగళవారం సరళసాగర్, కురుమూర్తి రాయ, నెల్విడి ఎత్తిపోతల పథకాలను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సరళసాగర్, కురుమూర్తి రాయ, నెల్విడి లిఫ్టుల పునరుద్ధరణ పనులు చాలా కాలంగా నిలిచిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రధాన ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరాయని, రైతులు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని విమర్శించారు.
పంటల సీజన్‌లో లిఫ్టుల ద్వారా నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం తానే స్వయంగా ఈ ఎత్తిపోతల పథకాలను పరిశీలించి, సంబంధిత ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలపై స్పందించిన ప్రభుత్వం సరళసాగర్ లిఫ్ట్ పునరుద్ధరణకు రూ.1.94 లక్షలు, కురుమూర్తి రాయ లిఫ్ట్ పునరుద్ధరణకు రూ.1 కోటి 45 లక్షల 20 వేల రూపాయలు,నెల్విడి లిఫ్ట్ పునరుద్ధరణకు రూ.92 లక్షలు నిధులు మంజూరు చేస్తూ జీవో విడుదల చేసిందని అన్నారు. అలాగే లిఫ్టుల పునరుద్ధరణకు నిధులు మంజూరు చేసిన రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభించి, రాబోయే వర్షాకాలానికి ముందే మరమ్మత్తులు పూర్తి చేసి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.

