కలం, వెబ్ డెస్క్ : అండర్ 23 ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ (U23 Asia Wrestling Championship) లో భారత రెజ్లర్లు మరోసారి మెరిశారు. పోటీ నాలుగో రోజు భారత్ ఖాతాలో మరో నాలుగు పతకాలు చేరాయి. కుమార్ మోహిత్, చంద్రమోహన్ స్వర్ణ పతకాలు సాధించగా.. ఇద్దరు దీపక్‌లు రజతం, కాంస్యంతో ఆకట్టుకున్నారు. 65 కేజీల విభాగంలో కుమార్ మోహిత్ అద్భుత ప్రదర్శన చేశాడు. కిర్గిజ్‌స్తాన్‌కు చెందిన ఓస్కోన్‌బై అబ్దిసమటోవ్‌పై 12-4 తేడాతో గెలిచి స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు.
79 కేజీల విభాగంలో చంద్రమోహన్ ఉత్కంఠ పోరులో విజయం సాధించాడు. కజకిస్థాన్‌కు చెందిన యెర్ఖాన్ అబిల్‌పై 7-6తో గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. 61 కేజీల ఫైనల్లో దీపక్ పోరాడినా.. కజకిస్థాన్ రెజ్లర్ నుర్దానత్ ఐటానోవ్‌తో 4-4 స్కోరుతో ముగిసిన మ్యాచ్‌లో రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. 74 కేజీల విభాగంలో మరో భారత రెజ్లర్ దీపక్ మెరుగైన ఆటతీరుతో కాంస్యం దక్కించుకున్నాడు. తుర్క్‌మెనిస్తాన్‌కు చెందిన వతన్ అన్నైరాజోవ్‌పై 10-0తో ఏకపక్ష విజయం సాధించాడు.
ఇదే జోరును కొనసాగిస్తూ 92 కేజీల విభాగంలో కుమార్ పునీత్ రజత పతకం గెలిచాడు. అయితే ఫైనల్లో కిర్గిజ్‌స్తాన్ రెజ్లర్ ఉలుక్‌బెక్ సూరోంబెకోవ్ చేతిలో ఓడిపోయాడు. 86 కేజీల విభాగంలో మోర్ సచిన్ 4-1తో గెలిచి కాంస్య పతకం సాధించాడు. 125 కేజీల విభాగంలో లక్కీ ఫైనల్‌కు చేరినా.. కజకిస్థాన్‌కు చెందిన రిజాబెక్ ఐత్ముఖాన్ చేతిలో ఓడి రజతంతో ముగించాడు. ఇప్పటికే గత రోజు అక్షయ్ టీ ధేరే, విక్కీ స్వర్ణాలు సాధించగా.. తాజా ఫలితాలతో భారత్ ఫ్రీస్టైల్ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలంగా చాటుకుంది. టోర్నీ మిగతా పోటీల్లో కూడా భారత రెజ్లర్ల నుంచి మరిన్ని పతకాలపై ఆశలు పెరిగాయి.

