కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) తొలి హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక సిద్ధమవుతోంది. ఆదివారం సాయంత్రం 7 గంటలకు శ్రీలంక కొలొంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో భారత్, పాకిస్థాన్ (India-Pakistan) తలపడనున్నాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇప్పటి వరకు భారత్.. పాకిస్థాన్‌తో ఎనిమిది సార్లు తలపడితే వాటిలో ఏడుసార్లు విజయం సాధించింది. అదే విధంగా మొత్తం 16 టీ20ల్లో తలపడితే 12 మ్యాచ్‌లలో భారత్ పైచేయి సాధించింది. పాకిస్థాన్ మూడు గెలవగా, ఒక మ్యాచ్ డ్రాగా నిలిచింది. ఈ రికార్డ్‌తో భారత్ చాలా బలంగా బరిలోకి దిగుతోంది. అదే విధంగా మరోవైపు పాక్ కూడా ఈసారి ఎప్పటిలా ఉండదని, తాము చాలా కాన్పిడెంట్‌గా ఉన్నామని చెప్తోంది. భారత్‌కు చుక్కలు చూపుతామని ప్రగల్భాలు పలుకుతోంది.
తొలుత భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసి తర్వాత ఆడటానికి పాక్ రావడం, ఇప్పుడు ఈ మ్యాచ్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సమయంలో వెదర్ రిపోర్ట్ రంగంలోకి వచ్చింది. అంతా వేయికళ్లతో వేచిచూస్తున్న మ్యాచ్‌కు (India-Pakistan) వరుణుడి గండం ఉందా? మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండనుంది? మ్యాచ్ నిరాటంకంగా సాగుతుందా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఫ్యాన్స్‌ను సతమతం చేస్తున్నాయి. ఇంతకీ కొలంబోలో వాతావరణం ఎలా ఉండనుందంటే..
కొలంబో వాతావరణం ఈ మ్యాచ్‌కు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఆగ్నేయ బెంగాల్ ఉపసాగరంలో ఫిబ్రవరి 15 ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని శ్రీలంక వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే శనివారం వర్షం కారణంగా మైదానంపై కవర్లు వేశారు.
ఈ గ్రూప్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. ఒకవేళ మ్యాచ్ పూర్తిగా వర్షానికి కొట్టుకుపోతే, రెండు జట్లు పాయింట్లు పంచుకుంటాయి. అయితే మైదానంలో నీటి పారుదల వ్యవస్థ చాలా సమర్థంగా ఉండటంతో, వర్షం ఆగిన వెంటనే ఆటను తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. వాతావరణం జోక్యం చేసుకుంటే కుదించిన మ్యాచ్ జరగడం కూడా సాధ్యమే.
పిచ్ ఎలా ఉండబోతోంది?
ఈ మ్యాచ్ ప్రేమదాస స్టేడియంలో జరుగనుంది. ఇదే పిచ్‌పై ఈ టోర్నీలో ఆస్ట్రేలియా–జింబాబ్వే మ్యాచ్ కూడా జరిగింది. శనివారం పరిశీలనలో పిచ్‌పై పలుచని గడ్డి పొర కనిపించిందని అధికారులు తెలిపారు. సాధారణంగా ఈ మైదానం స్పిన్‌కు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ నుంచి గ్రిప్, టర్న్ వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఉన్న గడ్డి వల్ల ప్రారంభంలో బ్యాటర్లకు కొంత పేస్, బౌన్స్ దక్కే అవకాశం ఉంది. మధ్య ఓవర్లలో స్పిన్నర్లకు సహాయం పెరిగే సూచనలు ఉన్నాయి. వర్షం పడితే పిచ్ అంటుకునేలా మారి, నెమ్మదిగా బంతి వేసే బౌలర్లకు మరింత అనుకూలంగా మారవచ్చని అంచనా.
Read Also: అగ్నికి భయపడని జంతువులివే..!
Follow Us On: Sharechat


