కలం, వెబ్ డెస్క్: అమెరికా, భారత్ (India US) మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, చమురు వంటి కీలక రంగాలపై చర్చలు జరుగుతున్నాయి. దిల్లీ పర్యటనకు వచ్చిన యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు మాట్లాడారు. ‘ప్రపంచంలోనే అతిపెద్ద రెండు ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా పరస్పరం కలిసి పనిచేయాల్సి ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థనే ఇరు దేశాలకు సంబంధాలకు బలమైన పునాది. అయితే, ఇరు దేశాల సంబంధాల బలోపేతం గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. వాస్తవంలో ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పటికే ఎంతో దృఢంగా, బలంగా ఉన్నాయి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇంకా అభివృద్ధి చేయడం గురించే మా మధ్య చర్చలు జరుగుతున్నాయి’ అని పేర్కొన్నారు.
భారత్.. మా కీలక భాగస్వామి: మార్కో రుబియో
యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రుబియో మాట్లాడుతూ.. ‘అమెరికాకు ప్రపంచంలోనే అత్యంత కీలకమైన భాగస్వామ్యాల్లో భారత్ ఒకటి. ప్రధాని మోదీతో నిన్నటి సమావేశం అద్భుతంగా జరిగింది. అమెరికా, భారత్ కేవలం మిత్రదేశాలు మాత్రమే కావు, మేం వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. ప్రపంచవ్యాప్తంగా, ప్రాంతీయంగా పలు సమస్యలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయి’ అని రుబియో స్పష్టం చేశారు.

