epaper
Wednesday, February 18, 2026
epaper

కుర్రాళ్లు అదుర్స్​.. ఫైనల్​కు యువ భారత్​

కలం, వెబ్​డెస్క్​: భారత కుర్రాళ్లు అదరగొట్టారు(India U19). అద్భుత ఆటతో అండర్​–19 వరల్డ్​ కప్​ ఫైనల్​కు చేరారు. జింబాబ్వేలోని హరారేలో బుధవారం ఆఫ్ఘనిస్థాన్​తో జరిగిన సెమీస్​లో 7 వికెట్ల తేడాతో గెలుపొందారు. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్​ చేసిన ప్రత్యర్థి జట్టు 50 ఓవర్లలో 310 పరుగుల భారీ స్కోరు చేసింది. ఆ జట్టు ఆటగాళ్లు ఫైజల్​ షినోజాదా(110; 93 బంతుల్లో 15 ఫోర్లు), ఉజైరుల్లా నియాజాయ్​(101 నాటౌట్; 86 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్​లు) సెంచరీలు చేశారు. భారత బౌలర్లలో దీపేశ్​ దేవేంద్రన్, కనిష్క్​ చౌహాన్​ చెరో రెండు వికెట్లు తీశారు.

ఛేదనలో యువ భారత్​ (India U19) ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. ఓపెనర్లు ఆరోన్​ జార్జ్​ (115; 104 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్​లు), వైభవ్​ సూర్యవంశీ (68; 33 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్​లు) మొదటి వికెట్​కు 57 బంతుల్లోనే 90 పరుగులు జోడించారు. జార్జ్​ కాస్త నెమ్మదిగా ఆడగా, సూర్యవంశీ ఎడాపెడా బౌండరీలు, సిక్స్​లతో చెలరేగాడు. ఈ క్రమంలో 24 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే వెనుదిరిగాడు.

అనంతరం వచ్చిన కెప్టెన్​ ఆయుష్​ మాత్రే (62; 59 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్​లు) హాఫ్​ సెంచరీ చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో విహాన్​ మల్హోత్రా (38 నాటౌట్​; 47 బంతుల్లో 3 ఫోర్లు) తోడుగా సెంచరీ పూర్తిచేసుకున్న జార్జ్..​ జట్టును సురక్షిత స్థితికి చేర్చి పెవిలియన్​కు చేరాడు. అనంతరం వేదాంత్​ త్రివేది (5 నాటౌట్​) తో కలసి విహాన్​ లాంఛనం పూర్తి చేశాడు. భారత్​ మరో 53 బంతులుండగానే విజయం సాధించింది. ప్రత్యర్థి బౌలర్లలో ఒమర్జాయ్​ 2, జద్రాన్​ 1 వికెట్ తీశారు. కప్పుకోసం శుక్రవారం జరిగే తుదిపోరులో ఇంగ్లాండ్​తో భారత్​ అమీతుమీ తేల్చుకోనుంది.

  • అండర్​ –19 వరల్డ్​ కప్​లో భారత్​ ఫైనల్​కు చేరడం ఇది పదోసారి.
  • యువ భారత్​ 2016 నుంచి 2026 వరకు వరుసగా ఆరుసార్లు తుదిపోరుకు చేరింది.
  • అండర్​–19 వరల్డ్​ కప్​లో భారత్​కు ఇది అత్యధిక లక్ష్య ఛేదన. రెండో స్థానంలో 2002లో ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​ (304 పరుగులు) ఉంది.
  • అండర్​ 19 వరల్డ్​ కప్​ ప్లేఆఫ్స్​ మ్యాచ్​లో అత్యధిక పరుగులు(621) నమోదైన రెండో మ్యాచ్​ ఇది. మొదటి స్థానంలో ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా(631) మధ్య 2004లో జరిగిన మ్యాచ్ ఉంది.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>