కలం, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజ జట్లను గజగజలాడించే భారత బ్యాటింగ్ లైనప్ కుప్పకూలింది. పసికూన ఐర్లాండ్ బౌలర్ల ముందు మన స్టార్లు సాగిలపడ్డారు. కాగితం మీద వీర భయంకర హిట్టర్లుగా కనిపించే టీమిండియా ఆటగాళ్లు మైదానంలో మాత్రం చేతులెత్తేశారు. భారత బౌలర్లు శ్రమించి ప్రత్యర్థిని కట్టడి చేసినా బ్యాటర్ల బాధ్యతారాహిత్యం వల్ల భారత్ ఘోర పరాజయాన్ని (IND vs IRE) మూటగట్టుకుంది. టీమిండియా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులకే ఆలౌట్ అయింది. అభిషేక్ మినహా మరే స్టార్ బ్యాటర్ కూడా కనీసపు ఆటతీరును కూడా కనబరచలేకపోయారు. యువ సంచలనం వైభవ్‌ను ఏ స్టార్ల కోసం పక్కనబెట్టారు వారంతా ఐర్లాండ్ బౌలర్ల ధాటికి బెంబేలెత్తి పెవిలియన్ బాట పట్టారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు గట్టి పోటీ ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. ఐరిష్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ 36 బంతుల్లో 50 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి తోడుగా గారెత్ డెలానీ 32 బంతుల్లో 49 పరుగులతో మెరిశాడు. మిగతా వారిలో టిమ్ టెక్టర్ 17, రాస్ అడైర్ 12, బెన్ కాలిట్జ్ 15, జార్జ్ డాక్రెల్ 19 పరుగులు చేశారు. హ్యారీ టెక్టర్ డకౌట్ కాగా, లియామ్ మెక్‌కార్తీ 7, మాథ్యూ హంఫ్రీస్ 2, జై మూండ్రా 2 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. శివమ్ దూబేకు ఒక వికెట్ దక్కింది. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ ఒక ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చాడు.
భారత్‌కు 183 పరుగుల లక్ష్యం ఎదురైంది. ఈ ఛేదనలో ఓపెనర్ అభిషేక్ శర్మ ఒక్కడే పోరాడాడు. అతను కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 49 పరుగులు చేశాడు. కానీ అవతలి ఎండ్ నుంచి అతనికి అస్సలు సహకారం దక్కలేదు. మరో ఓపెనర్ సంజు శాంసన్ 5 పరుగులకే అవుటయ్యాడు. ఇషాన్ కిషన్ 1 రన్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 3 పరుగులకే పెవిలియన్ చేరాడు. తిలక్ వర్మ 21 బంతుల్లో 19 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ 9 పరుగులకే వెనుదిరిగాడు.
ఒకానొక దశలో భారత్ 100 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆఖర్లో శివమ్ దూబే 14 బంతుల్లో 25 పరుగులు చేసి ఆశలు రేపాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు ఉన్నాయి. కానీ లోయర్ ఆర్డర్ పూర్తిగా చేతులెత్తేసింది. అక్షర్ పటేల్ 15 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 8, అర్ష్‌దీప్ సింగ్ 2 రన్స్ చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగుతో నాటౌట్‌గా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మాట్ హోలార్డ్ 3 వికెట్లు పడగొట్టాడు. మాథ్యూ హంఫ్రీస్ 3 వికెట్లు తీశాడు. జై మూండ్రాకు 2 వికెట్లు దక్కాయి. లియామ్ మెక్‌కార్తీ, గారెత్ డెలానీ చెరో వికెట్ సాధించారు. పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లుగా సాగిన భారత బ్యాటింగ్ తీరుపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. పసికూన చేతిలో ఇలా చిత్తవడం అభిమానులను తీవ్రంగా కలచివేసింది.

