కలం, వెబ్ డెస్క్ : హెచ్‌ఎస్‌బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్‌లో హైదరాబాద్ హీరోస్ (Hyderabad Heroes) మరోసారి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా బంగా టైగర్స్‌ను ఏకంగా 28-0తో చిత్తు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే హైదరాబాద్ జట్టు దూకుడుగా ఆడింది. వేగవంతమైన దాడులు, కచ్చితమైన పాసింగ్‌తో కోల్‌కతా రక్షణను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలో సుమిత్ రాయ్ తొలి ట్రైతో జట్టుకు ఆధిక్యం అందించాడు. ఆ వెంటనే ఎడమవైపు నుంచి అద్భుతమైన డమ్మీ మూవ్‌తో రావువామా సెరువాకులా మరో ట్రై సాధించి హైదరాబాద్ ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.
రెండో క్వార్టర్‌లో కూడా హీరోస్ అదే జోరు కొనసాగించింది. ప్రత్యర్థిపై నిరంతరం ఒత్తిడి పెంచుతూ ఆడిన జట్టు, కెవిన్ వెకెసా ట్రైతో స్కోరును మరింత పెంచుకుంది. అతని అద్భుతమైన ముగింపు హైదరాబాద్‌కు పూర్తి ఆధిపత్యాన్ని తీసుకొచ్చింది. మూడో క్వార్టర్ ప్రారంభంలోనే మారిస్ లాంగ్‌బాటమ్ మరో ట్రై సాధించి విజయాన్ని దాదాపు ఖాయం చేశాడు. మరోవైపు హైదరాబాద్ డిఫెన్స్ అద్భుతంగా నిలిచి కోల్‌కతా జట్టుకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా కట్టడి చేసింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశమివ్వకుండా పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన హైదరాబాద్ హీరోస్ 28-0తో ఘన విజయం నమోదు చేసింది. ఈ విజయంతో హైదరాబాద్ హీరోస్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంటూ టైటిల్ రేసులో మరో బలమైన అడుగు వేసింది.

