Mobile Popup Ad
Mobile Popup Ad

రాధా యాదవ్ కంబ్యాక్.. సక్సెస్ సీక్రెట్ ఇదే!

కలం, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు స్పిన్నర్ రాధా యాదవ్ (Radha Yadav) దాదాపు 11 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ టీ20 జట్టులోకి అద్భుతమైన పునరాగమనం చేశారు. ఈ తాజా ఇంటర్నేషనల్ ఇన్నింగ్స్ కోసం తాను ఎలా సన్నద్ధమయ్యాననే విషయాలను ఆమె పంచుకున్నారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) లో చేసిన కృషి, టీమ్ మేనేజ్‌మెంట్ ఇచ్చిన మద్దతు, తోటి ఆటగాళ్ల నుంచి నేర్చుకున్న పాఠాలే తన కంబ్యాక్‌కు కారణమని ఆమె వివరించారు. దాదాపు 11 నెలల తర్వాత జట్టులోకి రావడం చాలా ఆనందంగా ఉందని రాధా యాదవ్ తెలిపారు.

జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో తన బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకున్నట్లు చెప్పారు. ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ తనకు ఎంతో ఉపయోగపడిందని, ముఖ్యంగా డెత్ ఓవర్లలో వేగంగా పరుగులు చేయడం, బౌలింగ్‌లో వైవిధ్యం ప్రదర్శించడం వంటి అంశాలపై దృష్టి పెట్టానని అన్నారు. భారత జట్టు కోచింగ్ స్టాఫ్ తనకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చి ఎంతో మద్దతుగా నిలిచారని, అది తనలో ఎంతో నమ్మకాన్ని నింపిందని పేర్కొన్నారు.

క్రికెట్‌లో నేర్చుకునే ప్రక్రియ ఎప్పటికీ ఆగదని రాధా యాదవ్ అభిప్రాయపడ్డారు. కోచ్‌లు, తోటి ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్ల నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చని చెప్పారు. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, ఫీల్డింగ్ ఎలా సెట్ చేయాలి అనే విషయాలను ఇతరులను చూసి గ్రహించవచ్చన్నారు. ఒక స్పిన్నర్‌గా వికెట్లు తీయడం, రన్ రేట్‌ను కట్టడి చేయడంపైనే తమ చర్చలు ఉంటాయని, అనవసర ప్రయోగాలు చేయకుండా క్రమశిక్షణతో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే ముఖ్యమని వివరించారు.

ఈ సందర్భంగా డబ్ల్యూపీఎల్ టోర్నమెంట్‌పై ఆమె ప్రశంసలు కురిపించారు. డొమెస్టిక్ క్రికెట్ నుంచి నేరుగా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రావడం గతంలో ఆటగాళ్లకు అంత సులువుగా ఉండేది కాదని, కానీ ఇప్పుడు డబ్ల్యూపీఎల్ వల్ల యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి ఒత్తిడిని ఎదుర్కొనే అనుభవం ముందే లభిస్తోందని చెప్పారు. తమ కాలంలో డొమెస్టిక్ తర్వాత నేరుగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు వస్తున్న యువ ఆటగాళ్లు ఇప్పటికే పూర్తి అవగాహనతో, మెరుగైన నైపుణ్యాలతో జట్టులోకి వస్తున్నారని తెలిపారు.

జట్టులో కొత్త ఆటగాళ్లు సులువుగా కలిసిపోయేలా చేయడంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కీలక పాత్ర పోషిస్తున్నారని రాధా యాదవ్ కొనియాడారు. కష్ట సమయాల్లో యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉంటూ, మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూమ్‌లోనూ అందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చే వాతావరణాన్ని వారు సృష్టించారని ఆమె ప్రశంసించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>