కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ఇంధన ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ గెయిన్స్ పన్ను (Windfall Tax)ను సవరించింది. జూలై 1 నుంచి ప్రారంభమయ్యే పక్షం రోజులకు గానూ ఈ కొత్త రేట్లు వర్తిస్తాయని వెల్లడించింది. ఈ తాజా సవరణలో భాగంగా పెట్రోల్ ఎగుమతులపై పన్నును పెంచిన ప్రభుత్వం, డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై విధులను తగ్గించడం గమనార్హం.
ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పెట్రోల్ ఎగుమతులపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకం (SAED) లీటరుకు రూ. 1.5 నుండి రూ.4 కి పెరిగింది. దీనికి భిన్నంగా, డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని లీటరుకు రూ.14 నుండి రూ.8.5 కి తగ్గించారు. అలాగే విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై లెవీని లీటరుకు రూ.12.5 నుండి రూ.7.5 కి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ సవరించిన కొత్త పన్ను రేట్లు జూలై 1 నుండి అమలులోకి వచ్చాయి. పశ్చిమ ఆసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మార్చి 27న డీజిల్, ఏటీఎఫ్‌లపై ప్రభుత్వం ఎగుమతి సుంకాలను విధించింది. అప్పటి నుండి ప్రతి పక్షం రోజులకు ఒకసారి ఈ రేట్లను సమీక్షిస్తోంది. కాగా, పెట్రోల్‌పై ఎగుమతి లెవీని మే 16 నుండి ప్రవేశపెట్టారు.

