కలం, వెబ్ డెస్క్ : ‘ఎప్పుడూ వాహనాలతో రద్దీగా ఉండే నగర రహదారులపై రోజువారీ ట్రాఫిక్ బాగా తగ్గింది. శివారు ప్రాంతాల్లోనూ సేమ్ సీన్.. జిల్లాలకు వెళ్లే రోడ్లపైనా సగంకంటే తక్కువ రాకపోకలున్నాయి. డాబా హోటళ్ళు, మొబైల్ ఫుడ్ స్టాల్స్ క్లోజ్ అయ్యాయి. ఆదివారం కాకపోయినా కొన్ని వీధులు ఖాళీగా కనిపిస్తున్నాయి. కానీ పెట్రోల్ బంక్ ల సమీపంలో మాత్రం విపరీతమైన రద్దీ నెలకొన్నది. కారణం.. ఇంధన కొరత. ఒకవైపు ఆయిల్ కంపెనీలు అంతా సవ్యంగానే ఉందని చెబుతున్నా, ‘నో స్టాక్’ బోర్డులు మాత్రం వాహనదారులను వెక్కిరిస్తున్నాయి. ఇంధనం లభించక, హోటళ్లు మూతపడి, సామాన్యుడు అడుగు బయట పెట్టాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.’
బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు..
దేశంలో ఇంధన కొరత (fuel shortage) సెగ సామాన్యుడిని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అటు ప్రభుత్వాలు, ఇటు ఆయిల్ కంపెనీలు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పదేపదే ప్రకటిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. నగరంలోని ప్రధాన కూడళ్లలో ఉన్న పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడైనా బంకులు తెరిచి ఉన్నాయన్న సమాచారం అందగానే ప్రజలు అక్కడికి పరుగులు తీస్తున్నారు. ఫలితంగా ఆయా బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కడుతున్నాయి. గంటల తరబడి వేచి చూసినా ఇంధనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేకపోవడంతో ఉద్యోగులు, చిరు వ్యాపారులు తమ రోజువారీ పనులను వదులుకోవాల్సి వస్తోంది.
నగర రోడ్లపై సెలవు వాతావరణం..
ఈ పరిస్థితుల ప్రభావం నగర రవాణా వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది. సొంత వాహనాలు బయటకు తీయలేని స్థితిలో చాలామంది వాహనదారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చే వారు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే రోడ్లన్నీ సుమారు 50 శాతం మేర ఖాళీగా కనిపిస్తూ, సెలవు దినాన్ని తలపిస్తున్నాయి. అయితే, ప్రైవేట్ రవాణా సేవలైన ఓలా, ర్యాపిడో వంటి యాప్‌లను ఆశ్రయిస్తున్న ప్రయాణికులకు కూడా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. డ్రైవర్ల కొరత లేదా ఇంధన ఇబ్బందుల కారణంగా బుకింగ్‌లు సకాలంలో దొరకడం గగనంగా మారింది. గంటల తరబడి వేచి చూసినా వాహనాలు కన్ఫర్మ్ అవ్వకపోవడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వంటింట్లోనూ మంటలు, హోటళ్ల మూత..
మరోవైపు గ్యాస్ కొరత ప్రభావం ఆహార రంగంపైనా పడింది. సిలిండర్లు దొరకని కారణంగా నగరంలోని అనేక హోటళ్లు, టిఫిన్ సెంటర్లు బోర్డులు తిప్పేస్తున్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో కూడా గతంలో వలె అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ అందుబాటులో ఉండటం లేదు. ఇదే అదునుగా భావించిన స్విగ్గీ, జొమాటో వంటి సంస్థలు ప్లాట్‌ఫామ్ ఫీజులను భారీగా పెంచేసి వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నాయి. కేంద్రం ఇంధన కొరత లేదని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం గ్యాస్ బుకింగ్ సమయాన్ని పెంచడం ప్రజల్లో మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఎలాంటి సమస్యలు లేవంటూనే బుకింగ్ నిబంధనల్లో మార్పులు చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
పుణ్యక్షేత్రాలకూ తప్పని సెగ..
ఈ ఇంధన కష్టాలు (fuel shortage) కేవలం సామాన్యుడి ఇంటికే పరిమితం కాకుండా పుణ్యక్షేత్రాలనూ తాకాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో గ్యాస్ కొరత వల్ల పలు హోటళ్లు మూతపడ్డాయి. దీంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. అటు వాహనాలు నడవక, ఇటు వంట చేయడానికి ఇంధనం అందక వ్యవస్థ మొత్తం స్తంభించిపోతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి గ్రౌండ్ రియాలిటీని గమనించి, సరఫరాను క్రమబద్ధీకరించకపోతే ఈ పరిస్థితి మరింత విషమించే ప్రమాదం ఉంది.

