కలం, వెబ్‌డెస్క్: టీమిండియా అదరగొట్టింది (India Beat Pakistan). బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ విజృంభణకు తోడు, బౌలింగ్‌లో సమష్టి ప్రదర్శనతో దాయాది దేశాన్ని చిత్తుగా ఓడించింది. టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. అనంతరం పాక్ ఛేదనలో 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఐసీసీ టోర్నీల్లో పాక్‌పై టీమిండియాదే ఆధిపత్యం అని మరోసారి రుజువైంది.
ఇషాన్ ధనాధన్..
టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ డకౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడి 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు సాధించాడు. ఇషాన్ ధనాధన్ ఆటతో భారత్ భారీ స్కోరు చేసేలా కనిపించింది. కానీ, పాకిస్థాన్ స్పిన్నర్లు రంగంలోకి దిగడంతో పరిస్థితి మారిపోయింది. పరుగులు రావడం నెమ్మదించింది. తిలక్ వర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 32 పరుగులు చేశారు. శివమ్ దూబే వేగంగా 27 పరుగులు జోడించగా, రింకూ సింగ్ చివర్లో 11 పరుగులతో మెరిపించాడు. దీంతో భారత్ గౌరవప్రద స్కోర్ నమోదు చేసింది.
భారత్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ ఏకంగా ఆరుగురు స్పిన్నర్లను రంగంలోకి దించింది. సైమ్ అయూబ్ నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. సల్మాన్ అఘా, ఉస్మాన్ తారిఖ్, షాహీన్ అఫ్రిది తలో వికెట్ పడగొట్టారు. అయినా భారత బ్యాటర్లు చివరి దశలో కీలక పరుగులు రాబట్టారు.
176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే తడబడింది. తొలి ఓవర్‌లో హార్దిక్ పాండ్యా వికెట్ తీసి ఒత్తిడి మొదలుపెట్టాడు. ఆ తర్వాత బుమ్రా రెండో ఓవర్‌లో వరుసగా రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. అనంతరం కాసేపటికే బాబర్ ఆజామ్‌ను అక్షర్ పటేల్ బౌల్డ్ చేయడంతో పాక్ ఆశలు మరింత దెబ్బతిన్నాయి.
ఉస్మాన్ ఖాన్ మాత్రమే కాస్త పోరాడుతూ 44 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. చివరకు పాకిస్థాన్ 114 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో పాండ్యా, బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలో రెండు వికెట్లు తీశారు. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
బ్యాటింగ్‌లో మోస్తరు స్కోర్ చేసినప్పటికీ, బౌలింగ్‌లో పూర్తి ఆధిపత్యం చూపిన భారత్ ఈ మెగా మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది. మొత్తంగా సమష్టి ప్రదర్శనతో టీమిండియా చిరకాల ప్రత్యర్థిపై ఘన విజయం అందుకుంది. టోర్నీలో తదుపరి మ్యాచ్‌లపై ఇప్పుడు అభిమానుల దృష్టి నిలిచింది.


