ఆక్టోపస్ దళాలపై డీజీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

కలం, హైదరాబాద్: గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలోని ఆక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని డీజీపీ సీవీ ఆనంద్ గురువారం సందర్శించారు. శిక్షణ కేంద్రంలోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం, ఆపరేషనల్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. అధికారులు, కమాండోలతో మాట్లాడి ఆక్టోపస్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాల పనితీరును, శిక్షణ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ అపరేషన్స్ డీజీ అనిల్ కుమార్ ఈ సందర్భంగా డీజీపీకి పలు అంశాలపై వివరణ ఇచ్చారు. ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ కార్యకలాపాలు, కీలక సంస్థలు, సున్నిత ప్రాంతాల్లో కాలానుగుణంగా చేపడుతున్న మాక్ ఎక్సర్‌సైజులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు, ఆత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి వివరించారు.

గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ వృత్తి నైపుణ్యానికి దేశవ్యాప్త గుర్తింపు

గ్రేహౌండ్స్ , ఆక్టోపస్ వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని డీజీపీ సీవీ ఆనంద్ కొనియాడారు.ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం, పోలీస్‌శాఖ నుంచి పూర్తిస్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సముదాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలు విధులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతోపాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ (అడ్మిన్) ఎం వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సీహెచ్ రఘునందన్, ఇతర అక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>