నల్గొండలో రూ. 65 కోట్లతో ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి

కలం, నల్లగొండ : నల్గొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చేస్తూ సూపర్ సిటీగా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) స్పష్టం చేశారు. శనివారం నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలోని మర్రిగూడ జంక్షన్ వద్ద నామ్ రోడ్డుపై రూ.65 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి వెంకటరెడ్డి (Minister Komatireddy) మాట్లాడారు. మర్రిగూడ ఫ్లైఓవర్ జంక్షన్‌ను హైదరాబాద్‌లోని ఫ్లైఓవర్ల మాదిరిగా ఆహ్లాదకరమైన పెయింటింగ్స్, ఆర్ట్స్, ప్రముఖుల చిత్రాలతో తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం నూతన ఫ్లైఓవర్ వద్ద స్పష్టమైన పేర్ల బోర్డులు, ఇండికేటర్లు తక్షణమే ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ చిక్కులు, కాలుష్యం, రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఇప్పటికే రూ.750 కోట్లతో ఔటర్ రింగ్ రోడ్డు మంజూరు చేశామని పేర్కొన్నారు. చర్లపల్లి, మర్రిగూడెంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో మట్టి రోడ్లు లేకుండా, అన్ని సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించేందుకు రూ.300 కోట్లతో ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. పట్టణంలో త్వరలోనే మరో రైల్వే ఫ్లైఓవర్ రానుందని, ఇటీవలే తాగునీటి పథకానికి సీఎంతో శంకుస్థాపన చేయించామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి మరో రూ. 290 కోట్ల నిధులు నెల రోజుల్లో మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన రైతులకు గతంలో ఎన్నడూ లేని విధంగా మెరుగైన నష్టపరిహారం చెల్లించామని గుర్తుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు ఉన్న హ్యాం రోడ్లను డబుల్ రోడ్లుగా మారుస్తున్నామని మంత్రి తెలిపారు. నల్గొండ – దేవరకొండ 4-లైన్ల రోడ్డు తరహాలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ రహదారులను విస్తరించి, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖను దేశానికే రోల్ మోడల్‌గా నిలుపుతామన్నారు.

అభివృద్ధి పనులతో పాటు నిరుపేదలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఉచిత విద్య, వైద్య సేవలు అందిస్తానని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, స్థానిక కార్పొరేటర్ పెరిక స్వాతి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్ రెడ్డి, ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఎస్ఈ పున్న మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జుకురి రమేష్, స్థానిక కార్పొరేటర్లు, తహశీల్దార్ పరుశురాం, అధికారులు పాల్గొన్నారు.

Read Also: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>