ఇమ్రాన్ ఖాన్‌ను చంపేందుకు కుట్ర..

కలం, స్పోర్ట్స్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్య పరిస్థితిపై(Health condition) ఆయన కుమారులు సులైమాన్ ఖాన్, ఖాసిమ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో ఉన్న తమ తండ్రికి సరైన వైద్యం అందడం లేదని, ఆయనను అంతమొందించే ప్రయత్నం జరుగుతోందని పాకిస్తాన్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా లంచ్ విరామంలో మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ కుమారులు ఈ వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. ఈ ఇంటర్వ్యూను ప్రసారం చేయకుండా అడ్డుకునేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రయత్నించినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే ప్రసార సంస్థ స్కై స్పోర్ట్స్ వెనక్కి తగ్గకుండా ఇంటర్వ్యూను టెలికాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో మ్యాచ్ రెండో సెషన్‌లో మైదానంలోకి దిగేందుకు పాకిస్తాన్ జట్టు కొంతసేపు నిరాకరించినట్లు కూడా వార్తలు వచ్చాయి.

‘తండ్రిని 23 గంటలకు పైగా ఒంటరిగా ఉంచుతున్నారు’

ఇమ్రాన్ ఖాన్ జైలు పరిస్థితులపై ఆయన కుమారుడు ఖాసిమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రిని రోజుకు 23 గంటలకు పైగా ఒక చిన్న గదిలో ఒంటరిగా ఉంచుతున్నారని ఆరోపించారు. గతంలో జైళ్లలో రాజకీయ ఖైదీలు మరణించిన ఘటనలను ప్రస్తావిస్తూ.. తమ తండ్రికి కూడా అలాంటి పరిస్థితి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. తమ తండ్రి కంటి చూపు కోల్పోయే పరిస్థితిలో ఉన్నారని, ఆయనకు తక్షణమే సరైన వైద్య చికిత్స అందించడం అత్యంత కీలకమని ఖాసిమ్ తెలిపారు.

‘కోర్టు ఆదేశించినా ఆసుపత్రికి తీసుకెళ్లలేదు’

మరో కుమారుడు సులైమాన్ ఖాన్ మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ తమ తండ్రిని స్వతంత్ర ఆసుపత్రికి తీసుకెళ్లకుండా కేవలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం తిరిగి జైలుకు పంపించారని ఆరోపించారు. అంతేకాకుండా, సాంకేతిక కారణాలను చూపిస్తూ తమకు పాకిస్తాన్ వీసాలు నిరాకరిస్తున్నారని సులైమాన్ తెలిపారు. దీంతో తమ తండ్రిని ప్రత్యక్షంగా కలుసుకుని ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం కూడా లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన

ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఇప్పటికే పలువురు మాజీ క్రికెట్ కెప్టెన్లు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు లేఖలు రాసినట్లు సమాచారం. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ మైఖేల్ అథర్టన్ సహా పలువురు ప్రముఖులు ఇమ్రాన్ ఖాన్‌కు సరైన వైద్య సహాయం అందించాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్వ్యూ ప్రసారం అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బ్రాడ్‌కాస్టర్ తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్, రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>