కలం, వెబ్ డెస్క్: తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సెప్టెంబర్ ఒకటో తేదీన కేంద్ర జల మంత్రిత్వ శాఖ తెలంగాణ, మహారాష్ట్రతో సమావేశం నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక సమీక్ష చేపట్టారు. మహారాష్ట్ర లేవనెత్తుతున్న అభ్యంతరాలకు ఎలాంటి సమాధానం ఇవ్వాలి.. అంతర్రాష్ట్ర వివాదాన్ని ఎలా పరిష్కరించుకోవాలి.. 148 మీటర్ల వద్దనే కట్టడం వలన తెలంగాణకు కలిగే నష్టాలు తదితర అంశాలను కేంద్రానికి వివరించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గతంలో జరిగిన ఒప్పందాలను కూడా సమావేశంలో ప్రస్తావించాలని సూచించారు. ఏ చిన్న అంశం కూడా వదిలిపెట్టకుండా.. సంపూర్ణంగా కేంద్ర అధికారులకు వివరించేలా పర్యవేక్షించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశించారు.
కేంద్ర జల సంఘం మీటింగ్‌పై..
సెప్టెంబర్ ఏడో తేదీన ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న జల వివాదాలపై కేంద్ర జల సంఘం సమావేశం నిర్వహించబోతుంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య సంవత్సరాలుగా వివాదం నెలకొంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి వాడకానికి సంబంధించి తరచూ ఘర్షణపూరిత వాతావరణం నెలకొంటుంది. ఈ నేపథ్యంలో CWC ఆధ్వర్యంలో జరగబోయే సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పటిష్టమైన వాదనలు వినిపించాలని సీఎం ఆదేశించారు.

