Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మడి నల్లగొండలో చెరువులు లూటీ.. యథేచ్ఛగా మట్టి దందా

కలం, నల్లగొండ బ్యూరో: అధికార పార్టీ అండ.. అధికారుల కనుసన్నలు.. ఇంకేముంది. చెరువుల్లో బంగారు గుడ్లు పెట్టే బాతులు దొరికాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మట్టి మాఫియా (Illegal Soil Mining) పంజా విసిరింది. అనుమతుల పేరుతో కొండంత అక్రమాలకు తెరలేపుతూ, వందల కోట్ల రూపాయల సహజ సంపదను ఇటుక బట్టీలకు తరలిస్తూ అధికార పార్టీ నేతలు కోట్లు వెనకేసుకుంటున్నారు. సాధారణంగా రైతులు, ప్రజలు వర్షాలు పడాలని, చెరువులు నిండాలని కోరుకుంటారు. కానీ, ఇక్కడ మాత్రం కొందరు అక్రమార్కులు చెరువులు ఎండిపోవాలని, ఎండలు దంచికొట్టాలని ప్రార్థిస్తుండడం గమనార్హం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నీరు లేని చెరువులను ఆసరాగా చేసుకుని అధికార పార్టీ స్థానిక నేతలు యథేచ్ఛగా మట్టి దోపిడీకి తెరలేపారు. ఇరిగేషన్, మైనింగ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ వందల కోట్ల రూపాయల మట్టి దోపిడీ సాగుతోంది. నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని ప్రధాన చెరువులు, వాగులను టార్గెట్ చేస్తూ అధికార పార్టీ నేతలు రోజుకు వందలాది టిప్పర్ల సారవంతమైన మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు.

​అనుమతులు గోరంత.. అక్రమాలు కొండంత..

నల్లగొండ (Nalgonda) జిల్లాలోని ​కట్టంగూరు మండలం మునుకుంట్ల చెరువులో నార్కెట్పల్లి మండలం చెరువుగట్టుకు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు తవ్వకాలు జరుపుతున్నారు. కేవలం 1000 మెట్రిక్ టన్నుల (దాదాపు 25 టిప్పర్లు) మట్టి తవ్వకానికి మాత్రమే అనుమతి ఉండగా, ఏకంగా 2,000 టిప్పర్లకు పైగా మట్టిని అక్రమంగా తరలించి ఇటుక బట్టీలకు విక్రయించారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం ‘మానవతా కోణంలో వదిలేశాం’ అంటూ వింత సమాధానాలు చెబుతున్నారు. ఇదే సమయంలో ​కేతేపల్లి మండలం చెరుకుపల్లి చెరువులో ఏటా మట్టి దందా సాగుతోంది. పెద్ద పెద్ద హిటాచీలతో రోజుకు 100కు పైగా టిప్పర్లలో మట్టిని తరలిస్తున్నారు. అధికారులు 10,000 మెట్రిక్ టన్నుల (250 టిప్పర్లు) అనుమతి ఉందని చెబుతున్నప్పటికీ, ఆ లెక్కన మూడు రోజుల్లో ముగియాల్సిన తవ్వకాలు రెండు వారాలుగా నిర్విరామంగా సాగుతున్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లా ​వలిగొండ మండలం గోకారం చెరువులో గత నెలన్నర రోజులుగా ఇక్కడ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఈ మట్టిని చౌటుప్పల్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. వీటితో పాటు ఇదే జిల్లాలోని అడ్డగూడూరు మండలం ధర్మారం చెరువు, కొండమల్లేపల్లి, డిండి, చింతపల్లి, దేవరకొండ ప్రాంతాల నుంచి హైదరాబాద్, జనగామ ప్రాంతాలలోని ఇటుక బట్టీలకు యథేచ్ఛగా మట్టి తరలిపోతోంది.

​నల్లగొండ నియోజకవర్గంలో రూ. 100 కోట్ల దోపిడీ?

​నల్లగొండ నియోజకవర్గ పరిధిలోని దోమలపల్లి, కంచనపల్లి, బుద్దారం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్, అనంతారం చెరువుల పరిధిలో అభివృద్ధి పనుల పేరుతో లక్షలాది టిప్పర్ల మట్టిని ఊడ్చిపడేశారు. ఈ ఐదు ప్రాంతాల్లో కొల్లగొట్టిన మట్టి విలువే దాదాపు రూ. 100 కోట్ల వరకు ఉంటుందని అంచనా. కనగల్ పరిధిలోని పెద్దగుట్టను దాదాపుగా కనుమరుగు చేయడమే కాకుండా, చారిత్రాత్మక కనగల్ వాగు రూపమే లేకుండా చేసి అక్కడి ఇసుకను కూడా దోచేశారు. ​మట్టిని తవ్వడం చిన్న విషయంగా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక భారీ నెట్‌వర్క్ నడుస్తోంది. ఒక్కో టిప్పర్ మట్టిని ఇటుక బట్టీలకు రూ. 15వేల నుంచి రూ. 20వేల వరకు విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ప్రతి చెరువులో కనీసం 1,000 టిప్పర్ల చొప్పున తవ్వినా.. అక్రమార్కుల జేబుల్లోకి సులభంగా రూ. 2 కోట్లు చేరుతున్నాయి. ​ఇంత పెద్ద ఎత్తున సహజ సంపద దోపిడీకి గురవుతున్నా.. ఇరిగేషన్, మైనింగ్, రెవెన్యూ శాఖల అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు నెపం నెట్టుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అధికార పార్టీ స్థానిక నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ మట్టి మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని, సహజ సంపదను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>