కలం, ఖమ్మం బ్యూరో: పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్ బియ్యం సరిహద్దులు దాటి అక్రమ వ్యాపారుల జేబులు నింపుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అందిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని దళారులు పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి (Sathupalli) నియోజకవర్గం కేంద్రంగా అక్రమ రవాణా దందా సాగుతోంది. విజయవాడ నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లారీలో భారీగా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు సేకరించిన పక్కా సమాచారంతో శనివారం అర్ధరాత్రి వి.ఎం.బంజర్ పోలీసులు మెరుపు దాడి చేశారు.
312 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని పోలీస్ స్టేషన్కు తరలించి బాధ్యులను విచారించారు. విజయవాడతో పాటు పలు ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా రవాణా చేస్తున్నట్లు స్పష్టమైంది. సీజ్ చేసిన బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. రేషన్ బియ్యం విక్రయదారుడు ఆలూరి నరేష్, డ్రైవర్ కవులురు శ్రీనివాసరావుపై వి.ఎం.బంజర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

