Mobile Popup Ad
Mobile Popup Ad

త‌మ్మారం సారా భ‌ట్టీలపై పోలీసుల మెరుపు దాడి

కలం, చింతలపాలెం : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని తమ్మారం (Thammaram) గ్రామంలో నాటుసారా తయారీ స్థావరంపై శనివారం ఉదయం పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. తమ్మారం గ్రామానికి చెందిన శేషం రామకృష్ణ అనే వ్యక్తి కృష్ణా నది ఒడ్డున ఉన్న బీడు భూమిలో గుట్టుచప్పుడు కాకుండా నాటుసారా తయారు చేయడానికి సారా బట్టీ ఏర్పాటు చేసినట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో చింతలపాలెం పోలీసులతో కలిసి స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించినట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు.

ఈ దాడిలో సారా బట్టీ వద్ద నిల్వ ఉంచిన 10 లీటర్ల బెల్లం పానకాన్ని, విక్రయానికి సిద్ధంగా ఉంచిన 2 లీటర్ల నాటుసారాను పోలీసులు గుర్తించారు. అనంతరం సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం పానకాన్ని పోలీసులు అక్కడికక్కడే పారబోసి, సారా బట్టీ సామాగ్రిని పూర్తిగా ధ్వంసం చేశారు. అలాగే నిందితుడి వద్ద లభ్యమైన 2 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ ఘటనపై చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో నిందితుడు శేషం రామకృష్ణపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ వివరించారు.

ఈ సందర్భంగా ఎస్ఐ పరమేష్ మాట్లాడుతూ… ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే నాటుసారా, ఇతర నిషేధిత పదార్థాల తయారీ, విక్రయాలు మరియు రవాణా చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. స్వల్ప లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదన్నారు. మండల పరిధిలో ఎవరైనా నాటుసారా తయారు చేసినా.. రవాణా చేసినా లేదా అమ్మకాలు జరిపినా వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన తీవ్రంగా హెచ్చరించారు. మండలంలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నా ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>