వానాకాలం ధాన్యం కొనుగోళ్లకు 100 రోజుల యాక్షన్ ప్లాన్

కలం, కరీంనగర్ బ్యూరో : రానున్న వానాకాలం ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు శ్యాం ప్రసాద్ లాల్( Shyam Prasad Lal) తెలిపారు. వానాకాలం పంట కొనుగోళ్లకు 100 రోజుల ముందస్తు ప్రణాళిక, గత ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన ధాన్యం మిల్లింగ్ పురోగతి తదితర అంశాలపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌లతో  కరీంనగర్ (Karimnagar)  కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్యాం ప్రసాద్ లాల్ మాట్లాడుతూ, గత యాసంగి సీజన్‌లో మిల్లర్లు, అధికారుల సమన్వయంతో రాష్ట్రవ్యాప్తంగా 82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రానున్న వానాకాలంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామని, అందుకు అనుగుణంగా ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా 100 శాతం ధాన్యం మిల్లింగ్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. సీఎంఆర్ లక్ష్యాలను సకాలంలో చేరుకునేందుకు అవసరమైతే మిల్లుల్లో పని గంటలు పెంచి, నిరంతరాయంగా మిల్లింగ్ కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అలాగే ప్రతి రైస్ మిల్‌కు  ప్రభుత్వం తరఫున ఒక మానిటరింగ్ అధికారిని నియమించాలని, పౌరసరఫరాల శాఖ అధికారులు, తహసీల్దార్‌లు తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి మిల్లింగ్ ప్రక్రియను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>