కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండ (Nalgonda) జిల్లాలో ధాన్యం సేకరణలో నెలకొన్న ప్రతిష్టంభన ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకునే స్థాయికి చేరింది. కనగల్ మండలం బచ్చన్నగూడెం ఐకేపీ సెంటర్ ఇన్‌చార్జ్ కొప్పుల సైదులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జిల్లావ్యాప్తంగా కలకలం రేపింది. అటు మిల్లర్ల వేధింపులు.. ఇటు రైతుల ఒత్తిడి మధ్య నలిగిపోయిన ఆయన ప్రాణత్యాగానికి సిద్ధపడటం క్షేత్రస్థాయిలో నెలకొన్న దారుణ పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తోంది. ఆత్మహత్యాయత్నానికి ముందు సైదులు విడుదల చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. “ధాన్యం సేకరణలో అటు మిల్లర్ల వేధింపులు భరించలేకపోతున్నాను. ఇటు రైతుల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. కనీసం నా ఆత్మహత్యతోనైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కొనుగోళ్లు సజావుగా సాగేలా చూడాలి.” అంటూ సైదులు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
సైదులు ఆత్మహత్యాయత్నం విషయం తెలియగానే బచ్చన్నగూడెం ఐకేపీ కేంద్రానికి రైతులు భారీగా చేరుకున్నారు. తమ కోసం శ్రమిస్తున్న ఇన్‌చార్జ్‌కు ఇటువంటి పరిస్థితి రావడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ధాన్యంలో తేమ శాతం, తరుగు పేరుతో మిల్లర్లు సెంటర్ ఇన్‌చార్జ్‌లను వేధిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సరిపడా లారీలు లేకపోవడం, మిల్లుల వద్ద అన్ లోడింగ్ ఆలస్యం కావడం వల్ల సెంటర్లలో ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. వర్షాలు వస్తాయన్న భయంతో ధాన్యం త్వరగా కాంటా పెట్టాలని రైతులు సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు విషం సేవించి అపస్మారక స్థితిలో ఉన్న సైదులును తోటి సిబ్బంది, రైతులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు ఆయన ప్రాణాలను కాపాడేందుకు శ్రమిస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే ఈ ఘటనపై స్పందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కేవలం విచారణలతో సరిపెట్టకుండా, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి, మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు.

