చేనేత రంగానికి రూ.1,360 కోట్లకుపైగా ఇచ్చాం: తుమ్మల

కలం, రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల నేతన్నల (Sircilla Handloom) సంక్షేమం, వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద రూ.3 కోట్ల 22 లక్షలతో జంక్షన్ అభివృద్ధి సుందరీకరణ, మోడల్ బస్ షెల్టర్ల నిర్మాణ పనులను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం ప్రారంభించారు. అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు త్రిఫ్ట్ ఫండ్ పథకానికి సంబంధించిన ఆర్డీ పాస్‌బుక్‌లు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక: తుమ్మల

జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సిరిసిల్ల అంటే చేనేతకు ప్రతీక అని, నేతన్నల కష్టానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. గత రెండేళ్లలోనే చేనేత రంగానికి రూ.1,360 కోట్లకుపైగా నిధులు అందించామని తెలిపారు. నేతన్నలకు ఏడాది పొడవునా పని కల్పించడంతోపాటు భద్రత, భీమా, సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. చేనేత ఉత్పత్తులకు మార్కెట్ కల్పించేందుకు ప్రభుత్వం అధిక ధర చెల్లించాల్సి వచ్చినా నాణ్యమైన చీరలనే కొనుగోలు చేస్తోందని పేర్కొన్నారు.

యార్న్ డిపో ఏర్పాటుతో చేనేత సహకార సంఘాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. నేతన్నల సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చుతోందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు సిరిసిల్ల ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందని, నేతన్నల సంక్షేమం కోసం మరిన్ని చర్యలు చేపడతామని తెలిపారు.

నాణ్యమైన చీరల ఉత్పత్తి: పొన్నం

సిరిసిల్లలో నాణ్యమైన ఇందిరా మహిళా శక్తి చీరలు తయారవుతున్నాయని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రభుత్వం సిరిసిల్ల నేతన్నలకు పని కల్పిస్తూ నాణ్యమైన చీరలు మహిళలకు అందిస్తుందని తెలిపారు. సిరిసిల్ల నేతన్నలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేతన్న.. గీతన్న వేరు కాదని, జిల్లా నేతగా నేతన్నల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సిరిసిల్ల మోడల్ చీర మహిళలకు అందుబాటు ధరలో ఒకటి తయారు చేసి.. జీఐ ట్యాగ్ వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

8 నెలలు ఉపాధి కల్పించాం: ఆది

ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వస్త్ర పరిశ్రమలో పేరుకుపోయిన బకాయిలను దశలవారీగా విడుదల చేసి నేతన్నల్లో విశ్వాసాన్ని పెంచిందన్నారు. 2024–25 సంవత్సరానికి 6.80 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడం ద్వారా వేలాది మంది నేతన్నలకు 8 నెలలపాటు ఉపాధి కల్పించామని తెలిపారు. 25 హెచ్‌పీ పవర్‌లూమ్‌లకు రూ.2 విద్యుత్ సబ్సిడీ అమలులోకి తీసుకురావడం ద్వారా పరిశ్రమకు ఊతమిచ్చిందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, ఎస్పీ మహేష్ బిగితే, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూప, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>