కలం, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 12 ఏండ్లు అవుతున్నా ఇంకా ఇక్కడి భాష, యాసలపై కొందరిలో వివక్ష తగ్గడం లేదని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) సినిమా టైటిల్‌ను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేసిన వెటకారపు పోస్టులు, వాటికి తెలంగాణ నెటిజన్లు ఇస్తున్న ఘాటు కౌంటర్లతో ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ రణరంగంగా మారాయి. సినిమా పోస్టర్‌ను ట్యాగ్ చేస్తూ ఒకరినొకరు దూషించుకునే స్థాయికి ఈ చర్చ చేరడంతో, నెటిజన్ల మధ్య ప్రాంతీయ భాషా వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది.
అచ్చమైన తెలంగాణ పదం
వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి, నాగదుర్గ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్ సుకుమార్, బన్నీ వాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విడాకులకు అచ్చమైన, స్వచ్ఛమైన తెలంగాణ పదమైన ‘ఇడుపు కాయితం’ను టైటిల్‌గా పెడుతూ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ టైటిల్ ఎంతో అద్భుతంగా ఉందంటూ తెలంగాణ నెటిజన్లు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే, ఇదే తరుణంలో ఏపీకి చెందిన కొందరు ట్రోలర్స్ రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టడం వివాదానికి దారితీసింది. ఒక్క ఈ సినిమా టైటిల్ పైనే కాదు, గత పన్నెండేళ్లుగా తెలంగాణ యాసలో వస్తున్న సినిమాలపై, జానపద గీతాలపై ఇలాంటి విద్వేషపు రాతలు రాయడం వీళ్లకు అలవాటుగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సబ్ టైటిల్స్ కావాలంటూ వెటకారాలు
తెలంగాణ పల్లెల్లో ‘ఇడుపు కాయితం’ అనే పదం చాలా ఫేమస్. దంపతులు విడిపోతున్నప్పుడు పెద్ద మనుషుల సమక్షంలో రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాయితం అంటారు. స్వచ్ఛమైన తెలంగాణ జీవితమే ఇతివృత్తంగా వస్తున్న సినిమా కాబట్టి ఈ టైటిల్ పెట్టారు. కానీ దీనిపై ఏపీ నెటిజన్లు కొందరు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెటకారం ఆడుతున్నారు. “సార్.. తెలుగు భాషలో డబ్ చేస్తారా, లేదంటే తెలంగాణ భాషలోనే చూడాలా? సబ్ టైటిల్స్ అయినా వేయిస్తే కొంచెం హ్యాపీ అవుతాం ఆంధ్రోళ్లం” అని ఒకరంటే, “ఆంధ్రాలో తెలుగు డబ్బింగ్ ఉంటుందా?” అని మరొకరు, “తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేసుకోండి సార్, మీ భాష ఏంటో మీ యాస ఏంటో” అంటూ ఇష్టమొచ్చినట్లు పోస్టులు పెట్టారు.
సురుకుపెడుతున్న నెటిజన్లు
ఈ వెటకారపు కామెంట్లపై తెలంగాణ నెటిజన్లు గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. “నువ్వు డబ్బింగ్ అని ఎగతాళి చేస్తున్న ఆ పలుకులు కాకతీయుల కాలం కంటే ముందు నుంచే ఈ నేల గుండెల్లో మోగుతున్న మాతృభాష. ఈ మాటలే ఉద్యమాలకు ఊపిరై, పోరాటాలకు నినాదాలై నిలిచాయి. మా భాష, యాసపై మీ దాడిని భరించలేకే కదా ఉమ్మడి ఏపీకి 12 ఏళ్ల కిందటే మేం ‘ఇడుపు కాయితం’ (Idupu Kayitham) ఇచ్చింది. మా రాష్ట్రాన్ని, భాషను కించపరిస్తే మౌనంగా ఉండం” అంటూ స్ట్రాంగ్ కౌంటర్లు ఇస్తున్నారు. అంతేకాదు, “రెండు దశాబ్దాల కిందట దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ‘మావిడాకులు’ అని సినిమా తీసినప్పుడు తెలంగాణ వాళ్లు ఇలానే తెలుగు డబ్బింగ్ ఉంటుందా అని అడగలేదు. అందరినీ తెలుగువాళ్లుగా గౌరవించడమే తెలంగాణతనం” అని గుర్తు చేస్తున్నారు.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి కూడా దీనిపై ఎక్స్‌లో స్పందించారు. “ఇడుపు కాయితం పేరులో, భావంలో స్పష్టత ఉంది. విడిపోయే కాగితం అని!. విడిపోయేటప్పుడు రాసుకునే ఒక పత్రమది. ఎందుకురా ఇంత ఓర్వలేని తనం. మరి ‘విడాకులు’లో ఏముందిరా.. ఆకులా? అర్థంకాకపోతే మూసుకోండి. సబ్ టైటిల్స్ ఉండవు, చూడకండి” అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
ట్రోలర్లను వదలొద్దు అంటున్న ఏపీ వాసులు
కావాలనే కొందరు తెలంగాణ యాసను ట్రోల్ చేస్తూ భాషోన్మాదానికి తెరతీస్తున్నారని, అలాంటి వారిని అస్సలు సహించొద్దని తెలంగాణ నెటిజన్లతో పాటు పలువురు ఏపీ వాసులు కూడా స్పందిస్తున్నారు. గతంలో ‘బలగం’ వంటి తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు వచ్చినప్పుడు ఏపీలోని చాలా ఊర్లలో ప్రత్యేక షోలు వేసుకుని మరీ ఆదరించామని వారు గుర్తుచేస్తున్నారు. ‘ఇడుపు కాయితం’ అనే టైటిల్ కథకు ఎంతో సరిగ్గా సరిపోయిందని, ఇలాంటి ట్రోలర్ల వల్ల రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు పెంచొద్దని నెటిజన్లు కోరుతున్నారు.

