కలం, వెబ్ డెస్క్ : పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (IBOMMA) మరోసారి ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఈ సైట్, ఇప్పుడు సరికొత్త చిత్రాలతో మళ్లీ అందుబాటులోకి రావడం ఇటు సోషల్ మీడియాలోనూ, అటు సినీ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది.
గతంలో ఈ వెబ్‌సైట్ నిర్వాహకుడు నిందితుడు రవిని పోలీసులు గుర్తించి అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఐబొమ్మ సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పైరసీకి అడ్డుకట్ట పడిందని సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది. అయితే ఇటీవల నిందితుడు రవి జైలు నుంచి విడుదలైన కొద్ది రోజుల్లోనే, ఈ వెబ్‌సైట్ మళ్లీ కొత్త సినిమాలను అప్‌లోడ్ చేస్తూ యాక్టివ్‌గా మారడం అందరినీ షాక్‌కు గురిచేస్తోంది.
విడుదలైన కొన్ని గంటల్లోనే నాణ్యమైన ప్రింట్లను అందుబాటులోకి ఉంచుతుండటంతో, చిత్ర నిర్మాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందిన సినిమాల కలెక్షన్లపై ఈ పైరసీ సైట్ ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, డొమైన్ పేర్లు మారుస్తూ ఈ వెబ్‌సైట్ మళ్లీ మళ్లీ రావడం సైబర్ పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ప్రేక్షకులు కూడా పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే సినిమాలు చూడాలని సినీ రంగ ప్రముఖులు కోరుతున్నారు.

