కలం, నల్లగొండ: నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం (MGU Indoor Stadium) రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు సర్వసన్నద్ధమైంది. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంగా ఇది రూపుదిద్దుకుంది. తెలంగాణ ప్రభుత్వం భవిష్యత్తులో నిర్వహించబోయే వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఈ స్టేడియాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కోరుతూ విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ మద్దిలేటి క్రీడా శాఖ ఉన్నతాధికారులకు వినతిపత్రంతో పాటు స్టేడియం పూర్తి వివరాలను అందజేశారు.
ఈ క్రమంలో హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివనాగిరెడ్డి, స్పోర్ట్స్ విభాగ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలలను డాక్టర్ మద్దిలేటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఇండోర్ స్టేడియంలో ఉన్న ఆధునిక సదుపాయాలు, విస్తీర్ణం, క్రీడా రంగానికి కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదికను వారికి సమర్పించారు.
ఈ సందర్భంగా డాక్టర్ మద్దిలేటి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన ఎంజీయూ ఇండోర్ స్టేడియం రాబోయే రోజుల్లో అనేక రకాల ఇండోర్ క్రీడలకు ప్రధాన వేదికగా మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని రకాల వసతులతో అందుబాటులోకి వచ్చిన ఈ మల్టీపర్పస్ స్టేడియం గ్రామీణ, పట్టణ ప్రాంత క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. తెలంగాణ క్రీడా శాఖ ప్రతిపాదనలకు అనుగుణంగా ఇక్కడ పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించేందుకు విశ్వవిద్యాలయ యంత్రాంగం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

