కలం, చంద్రుగొండ: భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవ వేడుకలను భద్రాద్రి జిల్లా చంద్రుగొండ ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రుగొండ (Chandrugonda) యూత్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులకు జూనియర్, సీనియర్ విభాగాలుగా వక్తృత్వ పోటీలను నిర్వహించారు. విద్య యొక్క ప్రాముఖ్యత, సమాజ అభివృద్ధిలో విద్య పాత్ర, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై విద్యార్థులు తమ ప్రసంగాలతో ప్రతిభను చాటుకున్నారు.
ఈ పోటీల్లో మొదటి, ద్వితీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు షీల్డులు, మెడల్స్ అందజేసి అభినందించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని కార్యక్రమానికి హాజరైన ప్రముఖులు పేర్కొన్నారు.
ఈ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి చంద్రుగొండ మండల ఎస్ఐ విజయకుమారి, ZPHS పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై. ఉప్పల్ రెడ్డి, ఉపసర్పంచ్ అంతటి రామకృష్ణ, చంద్రుగొండ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ తుమ్మలపల్లి సురేష్, 3వ వార్డు సభ్యులు ఎస్కే ఇమ్రాన్ పాషా, ప్రతిభ విద్యాలయం కరస్పాండెంట్ బాబా సార్, మైనారిటీ నాయకులు ఎండీ షబ్బీర్, ఎండీ సాబీర్, ఎండీ నయీం, అతిక్, నాబిద్, NSUI మండల అధ్యక్షులు ఎస్కే వసీం పాషా, సీహెచ్. మనోహర్, కడియాల పుల్లయ్య తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.
అలాగే పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించారు. జాతీయ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో విద్య పట్ల ఆసక్తిని, పోటీతత్వాన్ని పెంపొందించేలా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన చంద్రుగొండ యూత్‌ను పలువురు అభినందించారు.

