కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మూసాపేటలో ఓ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కునిపోయాడు. హైడ్రా (HYDRAA) అధికారులు వెంటనే స్పందించి.. తీవ్రంగా శ్రమించి అతడి ప్రాణాలు కాపాడారు. ఆంజనేయ నగర్‌లోని మూడంతస్తుల భవనంలో మురళి(40) అనే వ్యక్తి తన భార్యతో గ్రిల్స్ ఉండే లిఫ్ట్ ఎక్కాడు. రెండో అంతస్తుకి వెళ్లగానే మురళి బయటకు వెళ్లాలని ఒక కాలు బయట పెట్టాడు. ఇంతలో మూడో ఫ్లోర్‌లో లిఫ్ట్ బటన్ నొక్కడంతో పైకి వెళ్లడం ప్రారంభించింది. దీంతో గ్రిల్స్ మధ్యలో కాలు ఇరుక్కుని, మురళి వేలాడుతూ ఉండిపోయాడు. అతడి భార్య గట్టిగా అరవడంతో స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించారు. సాధ్యం కాకపోవడంతో వెంటనే హైడ్రా సిబ్బందికి సమాచారం అందించారు.
గ్రిల్స్ తొలగించడంతో..
హైడ్రా మార్షల్ జేడీవీ ప్రసాద్, ఇతర సిబ్బంది అక్కడకు చేరుకుని మురళిని బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. లాభం లేకపోవడంతో సనత్ నగర్, కూకట్ పల్లిలోని డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పించి, పెద్ద కట్టర్లతో గ్రిల్స్ తొలగించే ప్రయత్నం చేశారు. అనంతరం, కొంత మేర గోడ పగలగొట్టడంతో మురళి ప్రాణాలతో బయటపడ్డాడు. కాలుకు ఫ్యాక్చర్ కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హైడ్రా సిబ్బంది త్వరగా స్పందించడంతో సురక్షితంగా బయటకు వచ్చాడని అపార్టుమెంట్ వాసులు పేర్కొన్నారు. లిఫ్ట్ వినియోగంపై జాగ్రత్తగా ఉండాలని హైడ్రా అధికారులు సూచించారు.

