కలం, ఖమ్మం బ్యూరో : ఆడుకుంటూ వెళ్లిన ఆ బుజ్జాయికి కారే కాలయముడిగా మారింది. కారులో చిక్కుకుని ఊపిరాడక నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయిన హృదయవిదారక ఘటన భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా జూలూరుపాడు మండలం వినోభానగర్‌లో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. నోభానగర్ సర్పంచ్ గంగావత్ నవీన్‌కు ఇద్దరు పిల్లలు. వారిలో పెద్ద కుమార్తె తన్విశ్రీ (4) ఆదివారం ఇంటి వద్ద ఆడుకుంటూ నిలిపి ఉంచిన కారు ఎక్కింది.
లోపలికి వెళ్లాక డోర్ వేసుకోవడంతో ఆటోమేటిక్ లాక్ పడిపోయింది. ఎంతసేపటికీ చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. దాదాపు రెండు గంటల తర్వాత కారులో చూడగా, తన్విశ్రీ ముందు భాగంలో రెండు సీట్ల మధ్య పడిపోయి ఉంది. వెంటనే స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి పాపను బయటకు తీశారు.
అపస్మారక స్థితిలో ఉన్న చిన్నారిని చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, పరీక్షించిన వైద్యులు బాలిక అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఉదయమే తమ కళ్ల ముందే ముద్దు ముద్దు మాటలతో అలరించిన కంటిపాప.. అంతలోనే విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటనతో వినోభానగర్‌లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

