కలం, మెదక్ బ్యూరో : ప్రజావాణి ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్(Hydra Commissioner) చర్యలు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు, అమీన్‌పూర్ మండలాల్లో కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. పటాన్ చెరు మండలం పాటిఘనాపూర్ గ్రామంలోని ఆనందనగర్ లేఔట్‌ను సందర్శించిన ఆయన, రహదారులు, పార్కులు, ప్రజా అవసరాలకు కేటాయించిన స్థలాలపై జరిగిన ఆక్రమణలను పరిశీలించారు. 1980లో 92 ఎకరాల్లో 1109 ప్లాట్లతో గ్రామపంచాయతీ అనుమతితో ఏర్పడిన ఈ లేఔట్ హద్దులను మార్చి, వ్యవసాయ భూమిగా చూపుతూ ధరణి ద్వారా పాస్‌బుక్స్ సృష్టించి ఆక్రమణలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులపై బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
లేఔట్ ప్రకారం పార్కులు, రహదారులను గుర్తించి వెంటనే ఆక్రమణలు తొలగించాలని అధికారులకు ఆదేశించారు. అనంతరం అమీన్‌పూర్ మండలం బీరంగూడలో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఔట్‌ను పరిశీలించారు. 1982లో 180 ఎకరాల్లో 1650 ప్లాట్లతో ఏర్పడిన ఈ లేఔట్‌లో కూడా కొంతమంది అక్రమంగా ఆక్రమించి ప్లాట్లుగా విక్రయిస్తున్నారని గుర్తించారు.
ఈ సందర్భంగా సొసైటీ ప్రతినిధులు పార్కులు, రహదారులను రక్షించాలని కోరగా, కొత్తగా ఆక్రమణలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ సూచించారు. ప్రభుత్వ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, ఇప్పటికే ఇళ్లు నిర్మించుకున్న వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. అదే విధంగా బీరంగూడలోని శంభుని కుంట అవుట్‌లెట్లను పరిశీలించిన కమిషనర్, వరదకాలువలను మూసివేసి నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాలువలను పునరుద్ధరించి బాధ్యులపై కేసులు నమోదు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

