హైదరాబాద్‌లో నీటి కొరత.. కీలక హెచ్చరికలు!

కలం, వెబ్ డెస్క్: ఎల్‌ నినో కారణంగా హైదరాబాద్ నగర పరిధిలో వర్షపాతం (Hyderabad Water Shortage) చాలా తక్కువగా ఉందని మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు వెల్లడించింది. తక్కువ వర్షాలతో నదులు, చెరువులు, రిజర్వాయర్లకు నీటి చేరిక తగ్గడంతో పాటు బావులు, బోర్ల రీఛార్జ్ కూడా లేకపోవడంతో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. రాబోయే రోజుల్లో నీటి కొరత ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నగర ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.

ఎట్టి పరిస్థితుల్లో వృథాను అరికట్టాలని కోరింది. నీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ఇప్పటికే ఆర్డర్ల ప్రకారం ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నట్లు మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు తెలిపింది. ప్రతి ఇంట్లో రెయిన్‌ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చింది. తక్కువ వర్షాలు పడినా.. వాటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాలు రీఛార్జ్ కావడంతో పాటు బయటి నీటి సరఫరాపై ఆధారపడటం తగ్గుతుందని వివరించింది.

జరిమానాలు తప్పవు..

హైదరాబాద్ నగరంలో నీటి వృథా అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని వాటర్ బోర్డు కోరింది. ఉద్దేశపూర్వకంగా వృథా చేసేవారికి ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో రూ.1,000 నుంచి ప్రారంభించి రూ.20 వేల వరకు జరిమానాలు విధిస్తున్నట్లు వివరించింది. అయినా కూడా పలు చోట్ల ఇష్టారీతిన నీటిని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. ఇక నుంచి మరింత ముమ్మరంగా తనిఖీలు చేస్తామని.. నీటిని వృథా చేస్తూ రెండోసారి పట్టుబడితే నల్లా కనెక్షన్ కూడా తొలగిస్తామని హెచ్చరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>