కలం, నారాయణపేట: ఆదివాసీ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు ఆదివాసీ సమాజంలో కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు (Adivasi Congress) పిలుపు నిచ్చారు. సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని (Narayanpet) డీసీసీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్యఅతిథులుగా రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ వి.లింగం నాయక్, రాష్ట్ర పరిశీలకులు శ్రీను నాయక్, పాల్గొన్నారు. ఆదివాసీ కాంగ్రెస్ కమిటీల నియామకానికి నాయకులు, కార్యకర్తల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తిస్తాం..
ఈ సందర్భంగా పరిశీలకులు శ్రీను నాయక్ మాట్లాడుతూ.. సంఘటన్ సృజన్ అభియాన్ ఉద్దేశం కేవలం కమిటీల ఏర్పాటు మాత్రమే కాదని అన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలను గుర్తించి వారికి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఆదివాసీ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం, ఆదివాసీ హక్కులు,పీసా, అటవీ హక్కుల చట్టాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించాలని సూచించారు. పదవి పొందడం కంటే బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడమే ముఖ్యమని శ్రీను నాయక్ స్పష్టం చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ వంటి ప్రతిపక్షాల విమర్శలకు ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ విధానాలు, ప్రభుత్వ కార్యక్రమాలను వివరించి వారికి గట్టిగా సమాదానం ఇవ్వాలని సూచించారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి..
రాష్ట్ర ఆదివాసీ కాంగ్రెస్ వైస్ చైర్మన్ లింగం నాయక్ మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలను గుర్తించి సంస్థాగతంగా తగిన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు పొందిన నాయకులు గ్రామస్థాయిలో ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదివాసీ మహిళలు, పేదలు,చిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. ఆదివాసీల హక్కులు, ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రాజకీయ విమర్శలను ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై కాంగ్రెస్ కార్యకర్తలు ధైర్యంగా పనిచేయాలన్నారు.
ఆదివాసీ కాంగ్రెస్ ను పటిష్టంగా నిర్మించాలి..
డీసీసీ అధ్యక్షులు ప్రశాంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట జిల్లాలో ఆదివాసీ కాంగ్రెస్‌ను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టంగా నిర్మించడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి గ్రామంలోని ఆదివాసీ ప్రజల సమస్యలను తెలుసుకొని వాటిని మండల, జిల్లా స్థాయికి తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేయాయడం జరుగుతుందన్నారు. పదవులు పొందిన ప్రతి నాయకుడు బాధ్యతతో పనిచేస్తూ ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఆదివాసీలు, ఎస్సీలు, అట్టడుగు వర్గాల అభివృద్ధి, హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలి..
బీజేపీ, బీఆర్‌ఎస్ విమర్శలకు ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ కార్యక్రమాల ద్వారా సమాధానం ఇవ్వాలని ప్రశాంత్ కుమార్ అన్నారు. సంఘటన్ సృజన్ అభియాన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా ఆదివాసీ కాంగ్రెస్ కమిటీల ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీల్లో బాధ్యతలు పొందే నాయకులు కేవలం హోదాలకు పరిమితం కాకుండా గ్రామస్థాయిలో ప్రజల మధ్య పనిచేసి సంస్థాగత నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యకర్తల నుంచి నాయకత్వాన్ని వెలికితీయడం, ఆదివాసీ హక్కులపై అవగాహన పెంచడం, ప్రజా సమస్యలను పరిష్కారం వైపు తీసుకెళ్లడం, కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.డి.సలీం, ఆదివాసీ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అనిల్ నాయక్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు శరణ్ నాయక్, జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గాజుల శివకుమార్,జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు గొల్ల. కృష్ణయ్య, విజయ్ నాయక్, శ్రీధర్ నాయక్,సర్పంచ్ లు శ్రీధర్ నాయక్, సురేష్ నాయక్, కృష్ణ నాయక్, తిరుపతి నాయక్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.

