ఆరేళ్ల మనవరాలితో కారు డ్రైవింగ్: రంగారెడ్డి జిల్లాలో పోలీసు నిర్వాకం!

కలం, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లాలో ఒక పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తీరు కలకలం రేపుతోంది. గంధంగూడ (Gandhamguda) – బైరాగిగూడ ప్రధాన రహదారిపై రద్దీ ఉన్న సమయంలో ఆయన తన ఆరేళ్ల మనవరాలికి కారు (TS 07 GP 7450) డ్రైవింగ్ నేర్పించడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. ఈ నిర్వాకం వల్ల వాహనాలు బంపర్ టు బంపర్ నిలిచిపోయి, రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాదకరమైన రీతిలో మైనర్ బాలికతో డ్రైవింగ్ చేయించడమే కాకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తుండటంతో స్థానికులు ఈ విషయమై ఎస్ఐని ప్రశ్నించారు.

అయితే, తన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి బదులుగా, ఆ అధికారి స్థానికులనే దబాయించారు. ‘నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు?’ అంటూ ఆయన ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. ఈ మొత్తం ఉదంతాన్ని అక్కడున్న వారు వీడియో తీయగా, ప్రస్తుతం ఆ దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ అధికారే ఇలా రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అందరికీ చట్టం ఒక్కటేనని, సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>