కలం, వెబ్ డెస్క్ : నగరంలో మరో హత్య కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్‌పల్లి (Upparpally) ప్రాంతంలో ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. హ్యాపీ హోమ్స్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ వసీం (32)ను అతడి స్నేహితులే కత్తులతో పొడిచి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. రోడ్డుపైనే జరిగిన ఈ ఘటన స్థానికంగా భయాందోళనకు గురిచేసింది.
పోలీసులకు సమాచారం ఇస్తున్నాడనే అనుమానం
పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. వసీం, నిందితులైన షోయబ్, ఇలియాజ్ మధ్య కొంతకాలంగా వివాదాలు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితులు సాగిస్తున్న గంజాయి, డ్రగ్స్ వ్యాపారం, ఇతర అక్రమ కార్యకలాపాల గురించి వసీం(muhammad waseem) పోలీసులకు సమాచారం అందిస్తున్నాడనే అనుమానం వారిలో పెరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కారణంగానే అతడిపై కక్ష పెంచుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. గతంలో వసీంతో పాటు నిందితులపై కూడా ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
నడిరోడ్డుపైనే కత్తులతో దాడి
ఘటన జరిగిన సమయంలో వసీం, నిందితుల మధ్య మాటామాటా పెరిగినట్లు సమాచారం. వివాదం తీవ్ర స్థాయికి చేరడంతో షోయబ్, ఇలియాజ్ కత్తులతో వసీంపై దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచక్షణారహితంగా కత్తులతో పొడవడంతో వసీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు
హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫుటేజీని పరిశీలిస్తున్న పోలీసులు ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరిస్తున్నారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న షోయబ్, ఇలియాజ్ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

