కలం, నిర్మల్ : సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు వేర్వేరు దొంగతనాల కేసులను పోలీసులు (Nirmal Police) ఛేదించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డీఎస్పీ పి.శ్రీనివాస్ వెల్లడించారు. ఈ నెల 6వ తేదీ రాత్రి సారంగాపూర్ మండల కేంద్రంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో రాజమణి ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లోని ఇత్తడి, వెండి వస్తువులను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు.
అదే రాత్రి జాం గ్రామానికి చెందిన రాజేశ్వర్‌కు చెందిన ద్విచక్ర వాహనాన్ని సైతం దొంగిలించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం, సేకరించిన ఆధారాల సహాయంతో నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన సుగేందర్, ఆదిలాబాద్‌కు చెందిన గబ్బర్ సింగ్ రాథోడ్‌లను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20 వేల విలువైన ఇత్తడి, వెండి వస్తువులతో బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల ఛేదనలో ప్రతిభ కనబరిచిన హెడ్ కానిస్టేబుల్ జమీర్, కానిస్టేబుళ్లు మాధవ్, రవిలను జిల్లా ఎస్పీ జానకీ షర్మిల, డీఎస్పీ శ్రీనివాస్ అభినందించారు. ఈ సమావేశంలో నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, సారంగాపూర్ ఎస్సై శ్రీకాంత్ పాల్గొన్నారు.

