బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్‌ను జైలుకు పంపిస్తాం: ఎమ్మెల్యే ఏలేటి

కలం, నిర్మల్: తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహాలు కేసీఆర్ కుటుంబమేనని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రాగానే కేటీఆర్‌(KTR)ను జైలుకు పంపిస్తామని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్‌లో బీఆర్ఎస్ నిర్వహించిన రైతు గర్జన సభలో కేటీఆర్ బీజేపీపై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా స్పందించారు. గురువారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నిర్మల్ అభివృద్ధిపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని, అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని హితవు పలికారు.

పదేళ్లు అధికారంలో ఉండి పూర్తిచేయని పనుల గురించి ఇప్పుడు గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాళేశ్వరం పంప్‌హౌస్‌ను ప్రారంభించామని చెప్పడం హాస్యాస్పదమని, దానికి విద్యుత్ కనెక్షన్ కూడా లేదని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రత్యేక చొరవతో రూ.1.08 కోట్ల నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టానని తెలిపారు. ఆలూరు వద్ద మూడు వేల ఎకరాలకు ఆయకట్టు కల్పించామని కేటీఆర్ చెప్పడం అవాస్తవమని, అక్కడ కేవలం 600 ఎకరాలకే ఆయకట్టు ఉందన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.

అమృత్ 2.0 పథకం కింద తాగునీటి సరఫరాకు రూ. 62 కోట్లు, మురుగునీటి శుద్ధి కేంద్రానికి రూ. 42 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. రూ. 23.74 కోట్లతో క్రిటికల్ కేర్ సెంటర్ నిర్మాణం చేపడుతున్నామని, నెల రోజుల్లో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్మల్ రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం తెలిపిందని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని వివరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఈ-కార్ రేసింగ్, ఫోన్ ట్యాపింగ్, ధరణి, కమీషన్ల వ్యవహారాల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

22ఏ భూముల వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఆధారాలతో ప్రజెంటేషన్ ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. రైతుల సమస్యలపై బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని, ధాన్యం కొనుగోళ్ల కోసం బీజేపీ పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అనేక అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఆధారమని తెలిపారు.

నిర్మల్ మున్సిపాలిటీలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏం అభివృద్ధి చేశారో కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిన రేవంత్‌రె డ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కేటీఆర్‌కు నిజంగా చర్చించే ధైర్యం ఉంటే బహిరంగ చర్చకు రావాలని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో పాటు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ప్రజల ముందు ఉంచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఏలేటి సవాల్ విసిరారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>