కలం, నిర్మల్: సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామంలో (Swarna Village) ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యను వెంటనే పరిష్కరించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Minister Ponguleti) అధికారులను ఆదేశించారు. గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రిని కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామంలో శిథిలావస్థకు చేరిన పాత ఇళ్లను కూల్చివేసి, ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను నిర్మించేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు. అయితే ఇరిగేషన్ శాఖ స్థలమనే కారణంతో అధికారులు నిర్మాణాలకు అడ్డంకులు కలిగిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో వెంటనే స్పందించిన మంత్రి పొంగులేటి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రాకు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని సూచించారు. శుక్రవారం నుంచే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, ఏఎంసీ చైర్మన్ అబ్దుల్ హదిల్ తదితరులు పాల్గొన్నారు.

