కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై జనసేన పార్టీ (JanaSena Party) వినూత్న వ్యూహాలతో పావులు కదుపుతోంది. రాష్ట్రంలో జనసేన శ్రేణులను, అభిమానులను పెంచుకునేందుకు విస్తృత కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు పాలన చేయడం.. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వంటి పరిణామాలు జరిగాయి. ఒక పార్టీకి ఒకటే ఎజెండా ఉండాలని.. రెండు కళ్ళ సిద్దాంతాలు ఉండకూడదని అప్పటి బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో బలంగా ప్రచారం చేసింది. బీఆర్ఎస్ చేసిన ఈ వ్యాఖ్యలు సైతం టీడీపీ, జనసేన పార్టీల రాజకీయాలు తెలంగాణలో తగ్గుముఖం పట్టేందుకు కారణమయ్యాయి.
పదేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ఇప్పటికే సగభాగం పాలన పూర్తి చేసుకోవడంతో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో ఏపీలో అఖండ విజయాన్ని సాధించిన జనసేన.. తెలంగాణలోను పార్టీకి పూర్వవైభవం తెచ్చేలా విశేష కృషి చేస్తోంది. ఎలాగైనా రానున్న ఎన్నికల్లో తన మార్క్ చూపించుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో వినూత్న మార్పులకు పార్టీ శ్రీకారం చుట్టింది. అన్ని స్థానాల్లో గెలిచి తమ సత్తా చాటాలని తెలంగాణపై రాజకీయ గురిపెట్టింది.
సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం
ఈ మేరకు తెలంగాణలో ఎన్నికల పోటీపై జనసేన పార్టీ గురువారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జనసేన సంస్థాగత పునర్వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. జూన్ 2 ముందు వరకు ఉన్న అన్ని పార్లమెంట్, జిల్లా, అసెంబ్లీ, జీహెచ్ఎంసీ ఇన్చార్జ్ పదవులు, పీవోసీ పదవులు, పార్లమెంట్, ఎమ్మెల్సీ కోఆర్డినేటర్లు, అన్ని అడ్హక్ కమిటీలు, మున్సిపల్, కార్పోరేషన్ కమిటీలు, నియామకాలను రద్దు చేసింది. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆశయాలు, పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై పోరాట స్ఫూర్తి తెలంగాణలో మరింత ఈ నూతన సంస్థాగత నిర్ణయం దోహదపడుతుందని నమ్ముతున్నట్లు పేర్కొంది.
కొత్త కమిటీలు, బాధ్యతలతో 2029 అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావాలని నిర్ణయించింది. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ, మున్సిపల్, కార్పోరేషన్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమైంది. గతంలో నిర్వహించిన పదవులు రద్దు చేయడమనేది ముగింపు కాదని.. వారికి మరింత క్రమబద్ధమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన బాధ్యతలను అప్పగిస్తూ నూతన వ్యవస్థకు మార్గం సుగమం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. తెలంగాణ ప్రజాక్షేత్రంలో నిరంతరం పనిచేసే రాజకీయ శక్తిగా జనసేనను తిర్చిదిద్దాలన్నదే ప్రధాన లక్ష్యంతో కృషిచేస్తున్నట్లు పేర్కొంది.

