కలం, వెబ్ డెస్క్ : వరదకలు ముంచెత్తని నగరమే లక్ష్యంగా హైడ్రా (HYDRAA) పని చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతో గతేడాది కుంభవృష్టి వర్షాలు పడినా ఇబ్బందులు తలెత్తలేదన్నారు. వరదల ప్రభావం లేని నివాస ప్రాంతాల వృద్ధికి సంబంధించి కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్,సెంట్రల్ వాటర్ కమిషన్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన సదస్సులో హైడ్రా (HYDRAA ) కమిషనర్ పాల్గొని మాట్లాడారు.
నగరంలో గొలుసుకట్టు చెరువులతో పాటు వాటిని అనుసంధానం చేసే వరద కాలువల పునరుద్ధరణ పెద్దయెత్తున చేపట్టామన్నారు. నగరంలో 24 చెరువుల పునరుద్ధరణను చేపట్టామని వెల్లడించారు. పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న వేళ.. చెరువులు, కుంటలు, కాలువలను పునరుద్ధరించుకోవాల్సినవసరాన్ని వివరించారు. చెరువులను పరిరక్షించుకోడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని.. ఆ క్రమంలో ఆక్రమణలు తొలగించి వాటిని కాపాడుతున్నామని వెల్లడించారు. చెరువులు, కాలువలు ఎఫ్‌టీఎల్ బఫర్ అంటే నగర ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందని.. ఇప్పుడు నిర్మాణ సంస్థలతో పాటు.. ఇల్లు కొనాలనుకునేవారు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రంగనాథ్ చెప్పారు.

