Mobile Popup Ad
Mobile Popup Ad

వ‌రి కొయ్య‌లు కాల్చ‌కండి.. రైతుల‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రిక్వెస్ట్‌

క‌లం, వెబ్ డెస్క్‌: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు ఎక్స్ వేదిక‌గా ముఖ్య విజ్ఞప్తి చేశారు. నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని రైతులు పొలాల్లో వ‌రి కొయ్య‌లు (Paddy Stubble), గ‌డ్డిని కాల్చ‌వ‌ద్ద‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌స్తుతం ఎండ‌లు ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో పంట వ్య‌ర్థాలు కాల్చ‌డం వ‌ల్ల మంట‌లు అదుపుత‌ప్పి, భారీ అగ్ని ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయ‌ని ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ మంట‌ల కార‌ణంగా ప‌క్క‌నే ఉన్న పండ్ల తోట‌లు, తాటి, ఈత వ‌నాలు, మోటార్ విద్యుత్ వైర్లు, కోత‌కు సిద్ధంగా ఉన్న పంట‌ల‌తో పాటు నిల్వ ఉంచిన వ‌రి ధాన్యం కూడా పూర్తిగా దగ్ధమవుతున్నాయని తెలిపారు. దీని వల్ల ఎంతో శ్రమించి పండించిన పంట క్షణాల్లో బూడిదై రైతులకు, తోటలపై ఆధారపడిన గౌడ సోదరులకు, వ్యవసాయ కార్మికులకు లక్షలాది రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమిలోని సేంద్రియ పదార్థాలు, రైతుకు మేలు చేసే ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశించి నేల సారం పూర్తిగా తగ్గిపోతుందని ఎమ్మెల్యే (Padi Kaushik Reddy) హెచ్చరించారు. తాత్కాలిక సులువు కోసం చేసే ఈ పని వల్ల దీర్ఘకాలంలో పంట దిగుబడులు తగ్గి వ్యవసాయ రంగం నష్టపోతుందన్నారు. కాబట్టి రైతులు పంట అవశేషాలను కాల్చకుండా వాటిని సేంద్రియ ఎరువులుగానో లేదా పశువుల మేతగానో మార్చుకోవాలని సూచించారు. గ్రామాల్లోని రైతులు, ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ప్రమాదవశాత్తు మంటలు కనిపిస్తే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, స్థానిక అధికారులకు సమాచారం అందించి ప్రకృతి సంపదను, రైతుల జీవనాధారాన్ని కాపాడాలని కౌశిక్ రెడ్డి కోరారు.

Read Also: కరీంనగర్‌లో చదరంగం పోటీలకు విశేష స్పందన

Reda Also: గుర్తింపు దక్కని అమరులెందరో..!

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>