కలం, కరీంనగర్ బ్యూరో: హుజురాబాద్ రూరల్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డు (Dumping Yard) రద్దు విషయంలో ప్రభుత్వం నుంచి 24 గంటల్లో స్పష్టమైన ప్రకటన రాకపోతే ప్రభుత్వాన్ని నిద్రపోనివ్వమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఘాటుగా హెచ్చరించారు. హుజురాబాద్ లో మీడియా సమావేశంలో గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడారు. హుజురాబాద్ జనాలు డంపింగ్ యార్డ్ వద్దని నెల రోజులుగా గగ్గోలు పెడుతున్న ప్రభుత్వానికి కనిపించడం లేదా..? వినిపించడం లేదా..? అని ప్రశ్నించారు. హుజురాబాద్ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ప్రజలను గోసపెట్టే చర్యలకు పూనుకున్నట్లు ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
తొత్తులుగా మారి తప్పుడు సమాచారం..
డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో అధికారులు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా మారి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతాం.. అనుకుంటే బీజేపీ చూస్తూ ఊరుకోదన్నారు. ఈ మీడియా సమావేశంలో హుజురాబాద్ మండల అధ్యక్షుడు పారిపెల్లి కొండల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు కొలగానీ రాజు, జమ్మికుంట మండల అధ్యక్షుడు దొంతరవెన రమేష్, ఇల్లందకుంట మండల అధ్యక్షుడు బైరెడ్డి రమణారెడ్డి, వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్, కమలాపూర్ మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్, మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్రాల నిర్మలాదేవి, సీనియర్ నాయకులు పుప్పాల రఘు, జిల్లా కార్యదర్శి నరసింహ రాజు, హుజురాబాద్ సీనియర్ నాయకులు రావుల భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు సుమలత, పంజాల మనోజ్, లక్ష్మీ దుర్గ, సర్పంచులు ఉప్పు మహేష్, భాష బోయిన శ్రీనివాస్, నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

