ఆఫీసులో మ‌హిళా ఉద్యోగుల ఫోటోల మార్ఫింగ్‌.. కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ అరెస్ట్

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ (Husnabad) విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. కార్యాలయంలో పని చేస్తున్న మహిళా ఉద్యోగుల ఫోటోలను రహస్యంగా సేకరించి, వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేస్తూ వికృత ఆనందం పొందుతున్న కంప్యూటర్ ఆపరేటర్ మహేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే… హుస్నాబాద్ విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో మహేష్ అనే వ్యక్తి గత 9 సంవత్సరాలుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో కలిసిమెలిసి ఉండే అతను అదే పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కార్యాలయంలోని మహిళా ఉద్యోగుల ఫోటోలు, ఇతర మహిళల చిత్రాలను రహస్యంగా సేకరించాడు. సేకరించిన ఫోటోలను తన వ్యక్తిగత వాట్సాప్ అకౌంట్ ద్వారా అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి, వాటిని ల్యాప్‌టాప్‌లో భద్రపరుస్తూ వచ్చాడని సమాచారం.

ఈ క్రమంలో ఒక రోజు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ సిస్టమ్‌లో మహేష్ వాట్సాప్ లాగిన్‌లో ఉండగా ఓ మహిళా ఉద్యోగి తన ఫోటో మార్ఫింగ్ చేసిన దృశ్యాలను వాట్సాప్ లో గుర్తించింది. దీంతో విషయం ఒక్కసారిగా బయటపడింది. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా వారు వెంటనే ల్యాప్‌టాప్‌ను పరిశీలించారు. పరిశీలనలో దాదాపు 1300 వీడియోలు, 2500కు పైగా మార్ఫింగ్ ఫోటోలు, పలు సీడీలు లభించినట్లు సమాచారం. దీంతో విద్యుత్ శాఖ డీఈ కృష్ణయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు మహేష్‌ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. నిందితుడిని హుస్నాబాద్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. నిందితుడు మరెవరైనా మహిళల ఫోటోలను దుర్వినియోగం చేశాడా, ఈ వ్యవహారంలో ఇంకెవరైనా ఉన్నారా, డార్క్ వెబ్ వినియోగించాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మహేష్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేస్తూ విద్యుత్ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఇతరుల వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>