కలం, వెబ్ డెస్క్ : టాలీవుడ్ (Tollywood) లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సినీ నటుడు భరత్ కాంత్ (31), ప్రముఖ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) దుర్మరణం చెందారు. భరత్ కాంత్ ఇటీవల విడుదలైన ‘టెనెంట్’ (Tenant) చిత్రంలో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. అంతకు ముందు పలు చిత్రాల్లో సహాయక నటుడిగా నటించారు. త్రిలోక్ పలు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఇద్దరు యువ ప్రతిభావంతులు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడం వారి కుటుంబ సభ్యులతో పాటు చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ప్రమాదం జరిగిందిలా..
ఆదిభట్ల పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు పట్టణానికి చెందిన భరత్ కాంత్, త్రిలోక్ చిన్ననాటి స్నేహితులు. గత కొన్ని రోజులుగా సొంతూరైన నెల్లూరులో గడిపిన వీరిద్దరూ కారులో హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. అయితే పెద్ద అంబర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి శంషాబాద్ వైపు వెళ్తుండగా బొంగుళూరు ఎగ్జిట్ 12 వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఓ కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో భరత్ కాంత్, త్రిలోక్ అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.

