ఆధ్యాత్మిక చిహ్నం నేలకొరిగింది!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి పాల్వంచ (Palvancha) మండలం జగన్నాధపురంలోని ప్రసిద్ధ పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న పురాతన వృక్షం వేళ్లతో సహా నేలకొరిగింది. ఈ సంఘటన భక్తుల గుండెలను కలచివేస్తోంది. ఈ వృక్షానికి ఒక విశిష్టమైన చరిత్ర ఉంది. స్థానిక నమ్మకం ప్రకారం.. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి చిన్న చిన్న ఊయలలు (తొట్టిలు) కడితే అమ్మవారి దయతో సంతాన భాగ్యం కలుగుతుందని ప్రతీతి. దశాబ్దాలుగా ఎందరో భక్తులు తమ కోరికలు నెరవేరాలని ఈ రావి,వేప కలయికతో ఉన్న వృక్షాన్ని దర్శించుకునేవారు.

ఇప్పుడు ఆ వృక్షం కూలిపోవడంతో, ఆ సంప్రదాయానికి ఆటంకం కలిగిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ​ఈ వృక్షం కేవలం చెట్టు మాత్రమే కాదు, అది ఒక పవిత్ర కళ్యాణ వేదిక. ప్రతి సంవత్సరం విజయదశమి పర్వదినాన ఈ వృక్షం నీడలోనే లక్ష్మీ-నారాయణుల వివాహ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేవారు. గ్రామీణ ఉత్సవాలకు, వేడుకలకు ఈ చెట్టు ఒక కేంద్రబిందువుగా ఉండేదనీ ఆలయ అర్చకులు చెప్తున్నారు. ​గత కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న విపరీతమైన గాలివానలు ఈ ప్రమాదానికి కారణమయ్యాయి.అదృష్టవశాత్తూ, చెట్టు కూలిన సమయంలో ప్రాణనష్టం జరగకపోవడం ఒక ఊరటనిచ్చే అంశం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>