కలం, స్పోర్ట్స్ : రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నీలో ఒక పెద్ద సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల విజేత, సెర్బియా స్టార్ నోవాక్ జకోవిచ్ (Djokovic)కు గట్టి షాక్ తగిలింది. బ్రెజిల్‌కు చెందిన 19 ఏళ్ల యువ ఆటగాడు జోవావ్ ఫోన్సెకా చేతిలో జకోవిచ్ ఓటమి పాలయ్యారు. ఈ ఓటమితో జకోవిచ్ తన 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ కల సాకారం చేసుకోలేకపోయారు. ఈ మ్యాచ్‌లో 39 ఏళ్ల జకోవిచ్ గట్టిగా పోరాడారు. మొదటి సెట్‌లో ఫోన్సెకా మొదట్లో 1-5తో వెనుకబడ్డారు.
ఆ తర్వాత పుంజుకున్నప్పటికీ జకోవిచ్ (Djokovic) మొదటి రెండు సెట్లను 6-4, 6-4తో గెలుచుకున్నారు. అయితే శారీరకంగా అలసిపోయిన జకోవిచ్ ఆ తర్వాతి సెట్లలో ఇబ్బంది పడ్డారు. దీనిని చక్కగా ఉపయోగించుకున్న ఫోన్సెకా మూడో సెట్‌ను 6-3తో, నాలుగో సెట్‌ను 7-5తో గెలిచి మ్యాచ్‌ను సమం చేశారు. ఇక విజేతను నిర్ణయించే ఐదో సెట్‌లో జకోవిచ్ మొదట 3-1తో ఆధిక్యంలోకి వెళ్లారు. కానీ ఫోన్సెకా స్కోరును సమం చేసి, ఆ తర్వాత 11వ గేమ్‌లో జకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేశారు.
దాదాపు 4 గంటల 54 నిమిషాల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరాటంలో ఫోన్సెకా చివరికి 4-6, 4-6, 6-3, 7-5, 7-5 తేడాతో అద్భుత విజయాన్ని అందుకున్నారు. స్టేడియంలో ఉన్న బ్రెజిల్ అభిమానులు పసుపు రంగు జెండాలతో తమ ఆటగాడికి పెద్ద పెట్టున మద్దతు పలికారు. మరోవైపు పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారతదేశానికి చెందిన యూకీ భాంబ్రీ, న్యూజిలాండ్‌కు చెందిన మైఖేల్ వీనస్ జోడి ఓటమి పాలైంది. ఇటలీకి చెందిన ఆండ్రియా వవాస్సోరి, సిమోన్ బొలెల్లి జంట చేతిలో 3-6, 4-6 తేడాతో వీరు ఓడిపోయారు. అయితే మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో యూకీ భాంబ్రీ, రష్యాకు చెందిన అలెగ్జాండ్రా పనోవాతో కలిసి తదుపరి మ్యాచ్ ఆడనున్నారు.

