కలం, వెబ్ డెస్క్: గతంలో ఆమె ఓ సాధారణ మహిళ. పలు ఇళ్లల్లో ఇంటి పని, వంట పని చేసుకుంటూ జీవనం సాగించింది. రాజకీయాల్లోకి ప్రవేశించి తన చేతికందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇటీవల పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందింది. నేడు ఏకంగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది. సాధారణ మహిళ నుంచి రాష్ట్ర మంత్రిగా మారిన ఆమె ప్రస్థానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్‌లోని ఔస్ గ్రామ్ నియోజకవర్గానికి చెందిన కలితా మాఝీ (Kalita Majhi) గతంలో ఇళ్లల్లో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేది. ప్రజా సేవపై ఆసక్తితో ఆమె బీజేపీ పార్టీలో చేరింది. 2014 నుంచి సాధారణ బూత్ లెవెల్ కార్యకర్తగా పార్టీలో పని చేసింది. పార్టీలో చురుగ్గా పని చేసి మంచి పేరు సంపాదించుకుంది. దీంతో ఆమెకు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. కానీ, ఆ ఎన్నికల్లో కలితా ఓటమిపాలైంది.
ఇక తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఔస్ గ్రామ్ నియోజకవర్గం నుంచి బీజేపీ మళ్లీ కలితా మాఝీని బరిలోకి దింపింది. పార్టీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ కలితా ఈ సారి ఘన విజయం సాధించింది. నేడు బెంగాల్ మంత్రి వర్గ విస్తరణలో కలితా సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కోల్‌కతాలోని లోక్ భవన్‌లో గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆమె తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పుడు రాష్ట్రం మొత్తానికి సేవ చేసే బాధ్యత తన భుజాలపై ఉందని చెప్పారు. ప్రధాని మోదీ, పార్టీ నాయకత్వం తనలాంటి సామాన్య కార్యకర్తకు ఇంతటి గొప్ప అవకాశాన్ని కల్పించడంపై ధన్యవాదాలు తెలిపారు.
కలితా గతంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దీంతో తన చిన్నతనంలోనే చదువుకు దూరమై, కుటుంబాన్ని పోషించడానికి ఇళ్లలో పని మనిషిగా చేరినట్లు చెప్పారు. ఆమె భర్త ప్లంబర్‌గా పని చేస్తుండగా, తమ కుమారుడు పాఠశాలలో చదువుకుంటున్నాడు. ఒకప్పుడు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి గురించే ఆలోచించిన తనకు, ఇప్పుడు మంత్రిగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలందరికీ సేవ చేసే అదృష్టం దక్కిందని కలితా హర్షం వ్యక్తం చేశారు.

