కలం వెబ్ డెస్క్ : ములుగు జిల్లాలోని మేడారం జాతర(Medaram Jatara)కు జనం పోటెత్తుతున్నారు. రోజురోజుకూ జాతర ప్రాంగణం మరింత సందడిగా మారుతోంది. మహాజాతర జనవరి 28 నుంచి ప్రారంభం కానుంది. కానీ, గత కొన్ని రోజుల నుంచే సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు జనం తరలివస్తున్నారు. జాతరకు వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లను దర్శించుకుంటారు. అసలే చలికాలం కావడంతో భక్తులకు పొద్దున్నే చన్నీళ్ల స్నానమంటే కాస్త ఇబ్బందిగానే ఉంది. ఇదే కొంతమందికి వ్యాపారం(Business)గా కలిసొచ్చింది. జాతరలో ఎంతో మంది వ్యాపారాలు చేస్తారు. టూత్ పేస్ట్ నుంచి నిత్యవసరాల వరకు అన్ని వ్యాపారాలు జరుగుతాయి. ఇక ఇప్పుడు ఏకంగా వేడి నీళ్ల(Hot Water) వ్యాపారం కూడా మొదలైంది. చలి తీవ్రత పెరుగుతుండటంతో వేడి నీళ్లకు మేడారంలో మంచి డిమాండ్ ఉంది. ఒక్కో బకెట్ రూ.50కి అమ్ముతున్నారు. వామ్మో… అంత ధరా… అంటూ షాకవుతూనే భక్తులు చేసేదేం లేక వేడి నీళ్లు కొనుక్కుంటున్నారు. ఇక పలువురు సోషల్ మీడియాలో ఈ మేడారం వేడినీళ్లకు సంబంధించిన వీడియోలు పోస్టు చేస్తున్నారు. ఇవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి.


