కలం, వెబ్ డెస్క్: ఏపీలోని మార్కాపురం (Markapuram) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున రాయవరం సమీపంలో ఉన్న క్వారీల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు టిప్పర్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే బస్సు, లారీలో మంటలు చెలరేగాయి. ప్రయాణికులు బస్సులో నుంచి కిందకు దిగేందుకు కష్టంగా మారింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి పామూరుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సులో కనిగిరి, పామూరుకు చెందిన ప్రయాణికులు అధికంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భారీ ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

