కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్రంలో పాలు ఉత్పత్తి చేసే రైతుల సాధికారత కోసం చేసిన విశేష సేవలకు గుర్తింపుగా, కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ చైర్మన్ చలిమెడ రాజేశ్వరరావు (Chalimeda Rajeshwar Rao) కు యూఎస్ఏ మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. జూలై 19న న్యూఢిల్లీలోని లోధి రోడ్‌లో ఉన్న ‘ఇండియా హ్యాబిటాట్ సెంటర్’లోని ‘గుల్మోహర్’లో జరిగే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
వ్యవసాయ పట్టభద్రులైన రాజేశ్వరరావు పాడి పరిశ్రమ రంగంలోనూ, రైతుల సాధికారత దిశగానూ అవిశ్రాంత కృషి చేశారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమను అదనపు ఆదాయ వనరుగా చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషించారు. రాజేశ్వరరావు నాయకత్వంలో కరీంనగర్ డెయిరీ అద్భుతమైన వృద్ధిని సాధించి, పాలు, పాల ఉత్పత్తుల సేకరణ, అమ్మకాల పరంగా తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిచింది. మార్కెట్ పరిధిని విస్తరించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి దోహదపడేలా ఆయన అనేక కొత్త ఉత్పత్తుల తయారీకి చర్యలు చేపట్టారు. ప్రస్తుతం లక్ష మందికి పైగా రైతులు కరీంనగర్ డెయిరీకి పాలను సరఫరా చేస్తున్నారు.
ఈ ప్రాంతంలో పాల ఉత్పత్తిని పెంచేందుకు, రైతులు, పాడి పశువుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ప్రారంభించడంలో రావు కీలక పాత్ర పోషించారు. 2020లో ‘ఉత్తమ మధ్య తరహా సంస్థగా ‘ఇండియా డెయిరీ అవార్డు’, 2019లో డెయిరీ రంగంలో ‘ఉత్తమ రిటైలర్’గా ‘ది హన్స్ ఇండియా అవార్డు’, 2018లో దేశంలోనే ‘ఉత్తమ నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తుల’కు గాను ‘ఇండియన్ అగ్రికల్చర్ అవార్డు’, 2017లో ‘ఉత్తమ పారిశ్రామికవేత్త’గా కరీంనగర్ లయన్స్ క్లబ్ అవార్డు, 2014లో ‘ఉత్తమ సామాజిక సేవ’కు గాను ఒంగోలులోని ఆచార్య ఎన్.జి. రంగా కిసాన్ సంస్థ అవార్డు, 2016లో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వారి ‘ఉత్తమ రైతు’ అవార్డు, 2010లో ‘ఉత్తమ సేవల’ విభాగంలో ‘డాక్టర్ సి. కృష్ణారావు అవార్డు’లను రాజేశ్వరరావు అందుకున్నారు.

